స్వాగతం, నమస్కారం.
ద్వారకామాయి, శ్రీ సాయికి, సాయిభక్తులకి నివాసం. ఎంతో పుణ్యం ఉంటేకానీ యోగుల జీవితం అర్ధంచేసుకోలేమని, సాయి చరిత్రలో హేమాడ్పంతుగారు చెప్పారు. ఎప్పుడు చేసుకున్న పుణ్యమో, ఈనాడు మా భాగ్యమై, మా శ్రీనిలయమునే ద్వారకమాయిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలనే ఆలోచన, మా అమ్మ చాగంటి శ్రీ లక్ష్మికి వచ్చింది. మూడు దశాబ్దాల ఆవిడ ప్రార్ధనలలో ఆవిడ భగవంతుడిని అన్ని రూపాలలోనూ, అన్ని రూపాలని శ్రీసాయిలోనూ కొలిచి తరించింది, తరిస్తోంది. కుటుంబంలో అందరి క్షేమం కోరే పూజలు చేస్తూ, మమ్మల్ని కూడా భగన్మార్గంవైపు నడిపిస్తోంది.
ప్రతియేడు, ఎన్నో పండగలు వస్తాయి. కానీ, మా ద్వారకామాయిలో ప్రతి గురువారం ఒక పండగ వస్తుంది. ఇంటి చుట్టుపక్కన ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ కలుస్తారు. అమ్మ శ్రీలక్ష్మి, శ్రీసాయికి హారతి ఇచ్చి “పల్లకీ సేవ” మొదలు పెడుతుంది. ఒకప్పుడైతే, ఒంటరిగానూ, తన జీవిత భాగస్వామి, చాగంటి సుబ్బారావుతోనూ, మాత్రమే చేసిన ఈ “పల్లకీ సేవ”కి, ఈనాడు ఎందరో పోటిపడి, తమకి పల్లకి మోసే అవకాశం దొరికితే అదృష్టంగా భావిస్తున్నారు. వారిలో, నేనుకూడా ఒకడిని. నా పేరు వినయ్ చాగంటి. నేను, శ్రీలక్ష్మీ-సుబ్బారావుల తనయుడిని.
దేవుడికి ఎన్నో రకాలుగా సేవలు చెయ్యచ్చు. నా సేవ, ఈ చిన్న వెబ్‌సైట్ ద్వారా. మా అమ్మ చేసిన, చేస్తున్న స్వరార్పణం, ఇక్కడ “శ్రీ స్వరఝరి” గా అక్షర రూపంలో ఉంచడం, నలుగురికి తెలిసేలా చెయ్యడం, నాకు ఆనందం. ఈ అక్షరకుసుమాలతో, దేవుడిని ఎవరైనా స్మరిస్తే, వారికి వచ్చే పుణ్యంలో, మా అమ్మకీ, నాకు కొంత భాగం వస్తుందని ఆశ. కానీ కర్మఫలాన్ని ఆశించకూడదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాటని గుర్తుతెచ్చుకుంటూ, నాకు ఈ కార్యంద్వారా వచ్చే పుణ్యమంతా “కృష్ణార్పణం” చేస్తూ… ఇటువంటి ఆలోచనా దృక్పధం నాలో కలగడానికి కారణమైన శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి రచనల స్ఫూర్తికి వందనం చేస్తూ… ద్వారకామాయిలో జరిగే ప్రతి పండుగా, విశేషం నేను మీతో పంచుకోగలిగే తెలివి, శక్తి, సమయం, నాకు ఇవ్వమని నా ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని అర్ధిస్తూ… శ్రీ సాయికృప మీపై ఎప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తూ… ఈ ప్రయత్నం, నా తల్లితండ్రులకే అంకితం.

New songs lyrics and all audios will be updated soon…
You can follow or subscribe below channel for latest songs audios… 👇