తిరుమలవాసుని దర్శనం, సర్వ పాపహరణం.
కలియుగం కదా,
స్వామి యుగదైవమైనా,
సాధారణ దర్శనం మహా కష్టతరం.
అందుకే ఇప్పటి వారికి,
ఎంత ఖర్చుపెట్టగలిగితే అంత,
శీఘ్రదర్శనం, సుదర్శనం.
అయితే, ఇదంతా ఒక ఎత్తు.
స్వామివారి దర్శనభాగ్యం కలగాలని రాసుంటే,
ఎలాంటి అవాంతరాన్నయినా ఎదుర్కునే శక్తి కూడా ఆయనే ఇస్తాడు.
కానీ, నేను గమనించిది వేరు.
కాదు, కాదు.
నా పిచ్చికాకపొతే, నేనెవరిని.
స్వామివారు నాకు చూపించింది వేరు అంటే సరి.
__________________
తండ్రిగా నా కొడుకుని నేను జాగ్రత్తగా పట్టుకుంటే, తల్లిగా
తన కళ్ళని కొడుకు మీద ఉంచి
చేతుల్ని భర్తచుట్టూవేసి
ఆ అనంత జనసందోహంలో,
లేని బలం తెచ్చుకుని
తోపులాటలోకూడా భర్త అడుగులో అడుగు వేస్తుంటే
ఆ తల్లి ప్రేమకి సాక్ష్యం కావాలా?
నేను తండ్రినయినా,
తనకి మాత్రం కొడుకునేనంటూ, నా తల్లి
నా ముందు దారిని తనకి వీలున్నంతవరకూ
సుగమం చేయడానికి పడే కష్టం చూస్తే
ఆ కష్టం వెనక ఉన్న ప్రేమని అనుమానించగలమా?
మోకాళ్ళ నొప్పులతో ఉన్నా,
యాభై పైబడిన వయసులో ఉన్నా,
కొడుకుతో సమానంగా నడుస్తూ,
కొడుకు చెయ్యి తప్ప
వేరెవరి చేయుత వద్దంటూ
మనసులో స్వామిని
పెదవులపై నరసింహ స్తుతిని ఉంచి
కొడుకుకోసం స్వామిని వరమడిగే ఆ తల్లి,
ఆ తల్లి ప్రేమ ఎవరికి అంకితమో కనబడదా, వినబడదా?
ఎదిగే తన పిల్లలని
అక్కున చేర్చుకుని నడిపిస్తూ
తన చీర అంచు తన కాలికి అడ్డంపడి
తను జారిపడితే,
ఆ పిల్లలు తన కోసంపడే బాధ చూస్తూ
తన నొప్పిని దాచి,
పిల్లల కోసం నవ్వుతూ పైకిలేచి
దెబ్బ తగిలిందో, రక్తం కారుతుందో కుడా చూసుకోకుండా
మళ్ళీ పిల్లలని నడిపించే ఆ తల్లి,
ఆ తల్లి ప్రేమని తూచగలమా?
అశేష భక్తజన సముద్రంలో తనకి, తన కూతురికి
మధ్య దూరిపోయిన ఘాతుకులని కూడా బ్రతిమిలాడి
తన కూతురికి దగ్గరవ్వాలని ఆ తల్లి పడే తపన
ఆ తపనకి, ఆ తల్లి ఓర్పుకి, ప్రేమ అనితప్ప వేరేపేరు ఇవ్వగలమా?
తన కొడుకు ఏమయిపోయాడో అని రోదిస్తూ,
దేవుడిచ్చిన రెండు కళ్ళూ చాలవేమో అన్నట్టుగా,
ముందుకి, వెనక్కి అయోమయంగా తిరిగే ఆ తల్లిని చూస్తే;
గుడిలో ఉన్న దైవాన్ని కళ్ళతో చూసి,
గుడి ప్రాంగణంలో ప్రసాదాన్ని నోటితో తిని,
ఆ పౌంఢ్రక భక్తులు, ఆ కళ్ళతో, ఆ నోటితో,
ఆ తల్లి అజాగ్రత్తని ఎత్తిచూపుతుంటే,
వారిది మూర్ఖత్వం అని తెలియదా?
ఆ భయంకరమైన మనోవేదనలో కూడా,
కొడుకు కోసం తల్లి పడే ఆరాటంలో ఆ తల్లి ప్రేమ కనుమరుగైపోయిందా?
దైవసన్నిధిలో ఉన్నా కూడా భయపడే తోటి భక్తురాలని జాలయినా కలగలేదా?
స్వామి దర్శనం త్వరగా అవడం కన్నా
కొడుకు ఆకలి తీర్చడం ముఖ్యం అనుకునే తల్లికి
భక్తి ఎక్కువా, లేక కొడుకంటే ప్రేమ ఎక్కువా?
ఎవడయ్యా, ఆ తల్లి ప్రేమని శంకించే సాహసం చేసెది?
లోకాన్ని సృష్టించిన స్వామి అయినా
ఆ స్వామికూడా లొంగేది, ఈ నిస్వార్ధ్ధమైన తల్లి ప్రేమకి కాదూ?
జాగృతి మొత్తానికి నాయకుడైనా, ప్రేమకి కారణభూతుడైనా
ఆ స్వామి కూడా ప్రేమకి కట్టుబడడూ?
ఇప్పుడు మనం స్వామికి పూజ చేయాలా, లేక ప్రేమించాలా?
ప్రేమలేని భక్తికి విలువనేది ఉందా?
______________________
స్వామీ, నాకు ఇవన్నీ చూపించే నీకు నా కోరిక సమర్పిస్తున్నాను.
నువ్వు దర్శనభాగ్యం కలిగించాలనుకున్నా,
నిన్ను ఆరాధిస్తూ, నీ ఉనికిని సైతం గుర్తించని త్యాగయ్య,
ఆ త్యాగయ్య నిన్ను ఎంత ప్రేమించాడో,
అంతగా నేనూ నిన్ను ప్రేమించేలా నన్ను నడిపించు స్వామీ.
నీ ప్రేమతో నీ దగ్గరకు చేర్చుకుంటున్నావు,
నీ ప్రేమని స్వీకరించే ధైర్యాన్ని ఇవ్వు స్వామీ.
ఓం నమో వేంకటేశాయ||