ప్రసాదం, స్వామి విలాసం

అక్టోబరు ఆరున, స్వామివారి దయవల్ల కల్యాణోత్సవంలో పాల్గొన్నాం, దర్శనం తృప్తిగా చేసుకున్నాం; మా చిన్ని రాముడికి తిరుమలలో ఆ స్వామివారి ప్రసాదంతోనే అన్నప్రాసన చేశాం. కొండదిగిన తర్వాత తిరుత్తణిలో కార్తికేయుడిని, షోలింగర్ లో యోగనరసింహస్వామిని, వేలూరులో నారాయణిని, కాణిపాకంలో గణేషుడిని కూడా దర్శించుకున్నాం.

ఆ తర్వాత, నేనేమో విజయనగరానికి, నా కుటుంబమంతా హైదరాబాదుకి బయల్దేరాల్సిన సమయం వచ్చింది. ఏదో చిరాకులో, ఇలా నా వాళ్ళందరినీ వదిలి ఉండాల్సొస్తోందని చిన్న కోపంలో, నేను స్వామివారి ప్రసాదం కూడా తినకుండా, ఎవరి గురించీ తీసుకోకుండా బయలుదేరాను. నొసటన బొట్టుతో, మన్సులో మంచి అలోచనలతో, మా బాబాయి, చంద్రశేఖర్, నాకు నచ్చజెప్పి నా చేతిలో నాలుగు లడ్డూలు పెట్టాడు. ఆ నిమిషంలో, ఈ లడ్డూలు ఎవరికి ప్రాప్తమో అనుకుని నేను బయల్దేరాను.

రేణిగుంట నుండి బయలుదేరిన ఖరగ్పూర్ ఎక్స్ప్రెస్స్ ఎక్కాను. మీరు నమ్మినా, నమ్మకపోయినా, ఆ రోజు ఆ ట్రెయినులో మంచినీళ్ళు అమ్మేవాడుకూడా రాలేదు. ఎదో తిని పడుకోవచ్చులే అనుకుని నేనేమో ఇంటినించి ఏమీ తెచ్చుకోలేదు. చివరికి ఆ రాత్రికి నా భోజనం, స్వామివారి ప్రసాదం, అర లడ్డు.

స్వామివారికి సరదాలెక్కువ కదా! అంతటితో ఆగుతారా? చూడండి ఆయన విలాసాలు.

గత ఏకాదశి నించి మొదలెట్టాను, నేను కూడా ఉపవాసం.

ఆ గత ఏకాదశికే నాకు స్వామి తన ఉనికిని చూపించారు. ఎలా అంటారా? ఆకలి తట్టుకోలేక, ఉపవాసం మానలేక, మధన పడుతుంటే; నా అర్ధాంగి నన్ను బాబా గుడికి తీసుకెడితే; ఆకలితో నన్నేం ప్రార్ధిస్తావురా అల్ప ప్రాణి అనుకున్నరేమో స్వామి. గుడిలో అడుగుపెట్టే ముందే వేరే భక్తుడి రూపంలో ప్రసాదం పెట్టారు. మళ్ళీ నిన్న ఏకాదశికి, రోజంతా ఉపవాసం ఉన్నా నిద్రపోయే ముందు తట్టూకోలెకపోతే; ఇంట్లో తినటానికి ఏవున్నాయని వెతుక్కుంటుంటే, మళ్ళీ ఆ స్వామివారి ప్రసాదం మరో లడ్డు నాకు ఊపిరి పోసింది.

ప్రసాదం తిన్న తర్వాత ఉపవాసం చేసినట్టు కాదనంటారా? అనండి, కాని నేను నా ప్రయత్నం మానను. నా చిత్తం సరిగ్గా ఉన్నంతవరకూ, నన్ను స్వామి ప్రసాదం కరుణిస్తే, నేను వద్దని అనను, అనలేను.

లడ్డూ ఎవరికి ప్రాప్తమో అనుకున్నాన్నేను. నా పిచ్చి. స్వామివారికి తెలుసు నేను ఆకలి బాధ పడతాననీ, ఆ సమయంలో నాకు ఈ ప్రసాదం అవసరమనీ. ఎంతైనా, కాలాతీతుడు కదా!

ఇక్కడితో కధ ముగిస్తే నేను రాసే వాడిని కాదేమో? కానీ ఆయన ఆడాడు, రాయించాడు.

ఆ మధ్యెప్పుడో, నా సరదాకి నేను పచ్చిపాలు తాగితే బాగుండును అనుకున్నా. ఏది, కుదిరితేగా? మొన్న దర్శనం తర్వాత, మా నాన్నగారు స్వామి పాదాలు చూసి ఆనందించానంటే, స్వామివారి ముఖం మాత్రమే చూసిన నేను కొంచెం అసూయ పడ్డాను. నిన్న, ఏకాదశి ఉపవాసం ఎలాచెయ్యాలని చదువుతుంటే, ఎదోచోట, ద్వాదశి రోజు పొద్దునే పరమాన్నం తిని ఉపవాసం విడవాలని రాసి ఉంది. నాకు పరమాన్నం ఎవడు చేసి పెడతాడులే అనుకుని, ఆ అలోచన కూడా వదిలేసాను. ఇవ్వాళ పొద్దున్న, అమ్మవారి కుంకుమ నొసటిమీద నిలబడటంలేదు, గంధం తెచ్చుకోవాలి అనుకున్నా. ఇలాంటి అలోచనలు వస్తూంటాయి, పోతుంటాయి అనుకుంటున్నారా? ఆగండి. ఇక్కడే స్వామివారి లీల మొదలు.

చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు వింటుంటే, వేంకటేశ్వర వైభవంలో ఆయన చెప్పిన మాట గుర్తుకొస్తుంది. వేంకటేశ్వర స్వామి తనకి తానుగా కరుణిస్తాడు అని. అలాగే, స్వామి వారు మాట్లాడరు కాని, తన ఉనికిని సంకేతాలద్వారా తెలుపుతారు అని.

ఆశ్చర్యం! చెయ్యడానికి ఏమిలేదులే, కాసేపు సరదాకి గుడికి వెల్దాం అనుకుని బయలుదేరితే, అద్భుతం ఎదురయింది. కళ్ళలో నీళ్ళని బలవంతంగా ఆపుకోవడం నా వంతయింది.

స్వామివారి నిజరూప దర్శనం, అభిషేకం చూసే అదృష్టం కలిగింది. గోవిందనామ స్మరణ చేస్తుంటే రొమాలు ఆనందంతో నిక్కపొడుచుకున్నాయి. స్వామివారి గుండెలకద్దిన గంధం పూజారిగారు తెచ్చిస్తే, ఏమని చెప్పను స్వామి కరుణ గురించి. తీర్ధం కన్నా ముందు పూజారి పచ్చిపాలు ఇస్తే ఏమని చెప్పను స్వామి కటాక్షం గురించి. తెల్లవారుఝామునే, ప్రసాదంగా పరమాన్నం పెడితే ఎలా వివరించగలను నా అనుభూతిని. వరుసలో ముందుకు నడుస్తూ, స్వామివారి పాదల దగ్గర నేను పుష్పం వెయ్యగలిగాను అంటే, అది స్వామివారికి నా మీద ఉన్న ప్రేమ కాకపోతే మరేమిటి.

నాకు కలిగిన అనుభవం గురించి రాయాలి అనుకున్నాను. అనుభవాన్ని వ్యక్తపరచగలనో లేదో కానీ, స్వామివారి ఉనికి మరో పదిమందికి తెలిసేలా రాయగలిగితే చాలని ఆయన్నే కోరుకున్నాను. నా రాతలో దొషాలు నావి, మన్నించండి. కాని రాయించింది స్వామివారు, ఆయన్ని గుర్తించండి.

ఎందరో భక్తుల ఎన్నో కోరికలు తీర్చటం, వారి పాపాలన్నింటిని హరించటం, ఏకకాలంలో చెయ్యగలిగిన ఆ శ్రీనివాసుడిని స్తుతించడం కన్నా మనం చెయ్యగలిగిన పుణ్యకార్యం లేదు!

ఓం నమో వేంకటేశాయ||

One thought on “ప్రసాదం, స్వామి విలాసం

  1. Krishna Kanth's avatar Krishna Kanth

    maku prasadam edi swamii..??mee javabu naku ardamaindi nannu kuda aa srinivasudu kanikarinchi prasadam pamputhademo chusthanu…Govinda Goovindaa…

Leave a comment