పామర ప్రేమతో, ఓ చిన్న విన్నపం

నల్లని నీ ఛాయలో ఎంత అందముందో,
ఆ అందం పంచితేనే పాలకి తెలుపు రంగు వచ్చిందేమో!
అందుకేగా, నీకు పాలతో అభిషేకం చేస్తుంటే, ఆ చిలిపి నవ్వు?

అయినా, నువ్వు అభిషేకం అడిగావా, అర్చన చెయ్యమన్నావా?
మమ్మల్ని తృప్తిపరుచుకోవడానికి మేము ఎంచుకున్న మార్గమేగా, పూజ!

సరేలే, అదలా ఉండనీ,
నా అజ్ఞానంతో నేనేదేదో మాట్లాడుతూ ఉంటాను.

నీ గురించి తెలుసుకుంటూ ఉంటే,
నాకు ఇప్పటిదాకా తెలిసింది అంతా వ్యర్ధమనే భావన మొదలయింది.
ఇది ఎవరి తప్పూ కాదు, కానీ
నాకేమీ తెలీదు అనే బాధ ఎక్కువైపోయి నన్ను హింసిస్తోంది.

ఘంటసాలగారు ఏం అదృష్టం చేసుకున్నారో,
ఆయన నిన్ను పలుపేర్లతో కీర్తించాడు.
ఆయన గాన మాధుర్యంలో నాకు నువ్వు వినబడుతున్నావ్.

చాగంటి కోటేశ్వర రావు గారు ఏం పుణ్యం చేసుకున్నారో,
ఆయన ప్రవచనాల్లో నాకు నిన్ను చూపించేస్తున్నాడు.
ఆయనకి ఆ శక్తి నువ్విచ్చినట్టే ఆయన ప్రపంచమంతా చాటింపేస్తున్నాడు.

సుబ్బలక్ష్మమ్మ అయితే ఏకంగా కారణజన్మురాలేమో,
ఆవిడ స్తుతిస్తుంటే, ఏమిటో అంత భక్తి పారవశ్యత!
నీ భక్తిలో పడి ఆవిడ భుక్తి గురించి మరిచిపోతే,
నువ్వు కాదూ ఆవిడకి తోడొచ్చింది!

ప్రసాదుగారి గురించి వేరే చెప్పాలా?
లోకంలో ప్రతి జీవీ నీ దర్శన భాగ్యం కోరచ్చు,
కానీ నాలుగు సంవత్సరాలు నీ సన్నిధిలో, నీకు సేవలు చేసే,
ఆ మహద్భాగ్యం ఎంతమందికి లభిస్తుందీ?
ఈ విషయాన్ని ప్రసాదుగారే, వల్లీశ్వరునితో కలిసి,
నాహం కర్తా, హరిః కర్తా అని బహుబాగా చెప్పేశాడు కదా!

మొన్నెప్పుడో విన్నాను. నీ వైభవాన్ని గురించే,
శివుడిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూదిని ఇస్తావుట!
నాకేం ఇచ్చావో కూడా నాకు తెలియట్లేదు.

రోజు నీ దర్శనానికి వస్తుంటే మాత్రం,
ఆ అందమైన గుడి ఆవరణలో ఎన్ని విషయాలు గుర్తుచేస్తావో!
నువ్వే సర్వదేవతా స్వరూపానివని నిరూపిస్తావ్.

నా పాదాల కింద చల్లదనం నువ్వంటావ్,
నేను పీల్చే గాలిలోని కమ్మని తులసీదళాల పరిమళం నువ్వేనంటావ్,

నాకు తగిలే గాలిలోని హాయి నువ్వంటావ్,
నా శిరస్సుపై సూర్యరశ్మిలోని వెచ్చదనం నువ్వేనంటావ్,

నేను తాగే తీర్ధంలో శివం నువ్వంటావ్,
నేను స్వీకరించే ప్రసాదంలో తియ్యదనానివి నువ్వేనంటావ్,
పంచభూతాలూ నువ్వేనంటావ్,

తిరుమలే మధుర అంటావ్,
రుద్రుడిని తిరుమలకి క్షేత్రపాలకుడిని చేసుకున్నావ్,
కానీ రుద్రుడు కూడా నువ్వేనంటావ్,

మాయా నువ్వేనంటావ్,
మాయకి నువ్వుకూడా లోబడి ఉంటానంటావ్,
నిన్ను ప్రేమిస్తే దగ్గరికి చేర్చుకుంటావ్,
ప్రేమించనివారికి కూడా నువ్వే వరాలిస్తావ్, ప్రేమతోనే లయం చేస్తావ్,

భక్తికి సులభంగా లొంగుతానంటావ్,
ఆద్యంతాలు లేని వాడినంటావ్,
తర్కంతో దొరకనంటావ్,
తత్వశోధన నిన్ను చేరే మార్గమంటావ్,

నీ పలుకే వేదమంటావ్,
మా చేత వేదం చదివించి మురిసిపోతానంటావ్.

అయ్యా! మహానుభావా! వింటున్నావా?
నాకు నీ గురించి ఏమీ తెలియట్లేదు.
ఎలా తెలుసుకోవాలో కూడా తెలియట్లేదు.
కానీ, నీ గురించి మాట్లాడాలని ఉంది,
నిన్ను భక్తమహారాజుల్లా కీర్తించాలని ఉంది,
నిన్ను మౌనీశ్వరుల్లా స్తుతించాలని ఉంది.

ఇప్పుడు నువ్వేంచేస్తావో నిర్ణయించుకో.
జ్ఞానసముద్రుడవు కదా,
అందుకే నారాయణుడు అనిపించుకుంటున్నావ్ కదా,
అందుకే చెప్తున్నా, మళ్ళీ వినుకో!

నాకు అడగడం తెలీదు, నాకు అడిగే జ్ఞానమే ఉంటే,
ఆ జ్ఞానాన్ని నిన్ను కీర్తించడానికి వాడతానేమో!
అలాంటి సౌభాగ్యం కూడా నువ్వే కలిగించాలేమో.

ఓ పని చెయ్యి స్వామీ.
నా కోరిక, నా తరపున నువ్వే అడిగేసుకో, తీర్చేసుకో.
నీకన్నా బాగా తెలిసినవాళ్ళెవరూ లేరు కదా!

ఉన్మాదప్రియుడివికుడా కదా,
ఏమి రాయించావో కూడా నువ్వే చదువుకో.

ఇప్పుడే కొంచెం బుధ్ధి రూపంలో పనిచేశావేమో,
ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అడగగలను,
“తప్పులుంటే క్షమించు, నన్ను మాత్రం కరుణించు”.

ఓం నమో నారాయణాయ ||

2 thoughts on “పామర ప్రేమతో, ఓ చిన్న విన్నపం

Leave a comment