నీ చూపు చాలు కదా!

దినమంతా దిక్కుతోచని పనులతో,
ఇంటికొచ్చినా వదలలేని చిరాకులతో,
ఏంచేస్తున్నానో తెలియని పరధ్యానంలో నేనుంటే,

చల్లగా, నా కంటి కొసకి తగిలే నీ చూపులోని పిలుపు;
అది చాలు నా చిరాకుని వదిలెయ్యడానికి.

పని ప్రాముఖ్యత గురించి చెప్పి,
నన్ను అలా చూడకు అని అందామని నీ వైపుకి తిరిగితే,
నీ చూపులోని ఆహ్వానం; ఏదైనా నీ తర్వాతే అని గుర్తుచేస్తోంది.
ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే నాది తెలివితక్కు”వదనం”.

నన్ను లాగిన నీ చూపులతో, నీతో గడిపే ఆ ఒక్క క్షణంలో:
నువ్వు అదోముఖంగా చూస్తుంటే, నీ కళ్ళలోని చిలిపితనం,
నీ కంటి కొసలకైనా నేనందాలని నా ఆరాటం,

నా ఆరాటాన్ని మళ్ళీ నీ కళ్ళతో నువ్వే ప్రేరేపిస్తుంటే,
నీ దరిలో చేరగానే నీ అధరమధురాలు నా శ్వాసకి అందుతుంటే,
కురులని అడ్డుతొలగించి నీ చెవి నా మాటకోసం సిద్ధపడ్డానని తలపిస్తుంటే,
నీ పెదవులపై చిరునవ్వు ఇల్లు కట్టుకుంటే,
ఈ జీవితానికి సరిపడే ఆనందం నీ ఒడిలోనే కదా.

ఈ క్షణం నా మనసు నీ వైపుకే పరుగులు తీస్తుంటే,
నీ చూపులు ఎలా మరువలగను, ఎలా వదలగలను!

Leave a comment