భయమేసింది… మీరేమైనా సలహా ఇస్తారా?

నాలుగు వందల టపాలు రాసిన తర్వాత నాకు కొంచెం భయమేసింది. కర్ణుడి చావుకన్నా ఎక్కువే ఉంటాయి కారాణాలు, కానీ బ్లాగడం ఆపాను. ఇప్పుడు మళ్ళీ రాస్తానంటే నా రాతల్ని కపిత్వంతో, నా పెర్సనాలిటినీ పైత్యంతో ముడిపెట్టి హింసిస్తారేమోనని కొంచెం జంకుగా ఉంది. అయినా సరే అని ఇవాళ తెగించేశాను. రాస్తే ఏమవుతుంది, మహా అయితే మరో కామెంట్ రాస్తారు. రాసి చూద్దామని మొదలెట్టాను. సర్లేండి, సినిమా కబుర్లు కావివి. నిజంగా…

ఏదో దేవుడి దయవల్ల, నాకు ఈ మధ్య కొంచెం దైవచింతన పెరిగింది. అంటే మీరు అర్ధం చేసుకున్నారో లేదో…అడక్కుండా వచ్చే ఎస్.ఎం.ఎస్ ఆఫర్లకి తెలీక క్లిక్ చేస్తే వచ్చినట్టు, కొన్ని సమస్యలు వచ్చాయ్; ఏం చెయ్యాలో తెలియని సమయంలో, అనుకోకుండా బుక్కైపోయిన తత్కాల్ టికెట్లాగా, పరిష్కారం దొరికింది. ఈ చివర నిలబడి దేవుడిని అడగాలనిపిస్తుంది “స్వామీ, నిన్నెప్పుడూ  స్మరించగలిగే శక్తినివ్వు” అని. ఆ చివర చూస్తే, “స్వామీ, నన్ను కష్టాలనించి బయటపడేసే పని పెట్టుకోకపోతే, అసలు కష్టాలే లేని జీవితం ఇస్తే బాగుండేది కదా” అనీ అనిపిస్తుంది. ప్రస్తుతానికి, దేవుడిని ప్రశ్నించడం మాని, పలకరిస్తుంటే మంచిదని, అవసరంలో తోడుంటాడని డిసైడ్ అయ్యాను. పైగా వేంకటేశుడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాత్రం స్పష్టంగా చెప్పలేను. బంగారు వాకిలిలో అడుగుపెట్టిన క్షణం నించి విమాన వేంకటేశుడి దర్శనం అయ్యేవరకూ, ఏదో చాలా హాయిగా ఉంటుంది మనసుకి. జీవితంలో కష్టసుఖాలు మరచిపోయే మధురక్షణాలవి.

సరే మరి. అసలు చెప్పాలనుకున్న విషయమేంటంటే, నేను ఇకముందు  ఏం రాస్తానో నాక్కూడా అంతగా అంచనా లేదు. కాని, రాస్తే నలుగురితోనూ కాస్త కబుర్లు పంచుకున్నట్టు ఉంటుందనిపిస్తోంది. నేను రాస్తే చదివే ఆ నలుగురూ ఎవరై ఉంటారో, వాళ్ళకి ఏం కబుర్లు చెప్పొచ్చో అని ఆలోచిస్తున్నాను. మీరేమైనా సలహా ఇస్తారా?

One thought on “భయమేసింది… మీరేమైనా సలహా ఇస్తారా?

  1. నాణ్యమైన కబుర్లకు సలహా అనవసరం. సారాంశంలోకి వెళితే పరులకు పనికివచ్చేది, ఇతరులకు ఇబ్బందికలిగించనివి, నలుగురికి జ్ఞానోదయం కలిగేవిగా వుంటే ముఖ్యంగా మీకు కలిగిన దైవ చింతన దిశగా పరిశీలిస్తే అంతకుమించినది మరొకటిలేదు. భయం నుంచి అభయం పొందే మార్గం సర్వవేళ సర్వావస్థలయందు భక్తిముక్తిప్రదాయకం.

Leave a comment