అన్నీ గుర్తున్నాయికదా? … ఆ, ఒకసారి మళ్ళీ చెప్పండి.

హైదరాబాద్ వచ్చి నలభై రోజులవుతోంది. మా ఆవిడ సంగీతానికి దూరమవుతోందేమో అనుకునేంతలో, తనే న్యూస్‌పేపర్ తెచ్చి, రవీంద్రభారతిలో జరిగే కచేరి సంగతి చెప్పింది. అక్కడికి వెళితే కొంతమంది పరిచయమవుతారు, మా ఆవిడలోని కళాకారిణిని కొంతమంది గుర్తించే అవకాశం ఉంటుంది అని, నేనూ తనతో బయలుదేరాను.

ఎంతైనా, ఒక ఇంటివాళ్ళం అయినతర్వాత మన అనుకునే పనులు బోలెడన్ని ఉంటాయికదా! అవేనండీ, మర్చిపోతే చిరాకుపెట్టే చిన్న విషయాలనించి, మనకి బాకీలున్నవాడు ఎక్కడ ఉన్నాడో ఏంచేస్తున్నాడో అన్నట్టు ఖంగారు పెట్టే పెద్ద విషయాలవరకూ; అవన్నీ తీరిగ్గా ఆలోచించే సమయం, నాకైతే మాత్రం, స్నానం చేస్తున్నప్పుడో, లేదా బండి నడిపేటప్పుడో. ఇక ఛాన్స్ వదులుతానా? ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గరనించి, రవీంద్రభారతి రీచయ్యేలోపు, నేను నాకు తోచిన పని తోచినట్టు మా ఆవిడకి గుర్తుంచుకోమని చెప్పడం మొదలెట్టాను.

తన నేను: పిల్లోయ్, మనం చాలా పనులు చెయ్యాలి. రేపు తీరిక చూసుకొని మనం అమ్మకి తన సామాను సరి చేసి పెట్టాలి, సరేనా?

నా తను: సరేనండి.

తన నేను: ఓయ్, మర్చేపోయా! మనం వెళ్ళేచోట మనం కలవాల్సిన మనిషి పేరు, చక్రపాణి అట. కొంచెం గుర్తుంచుకో…

నా తను: అలాగేనండి.

తన నేను: అమ్మాయ్, మా నాన్న ఇచ్చిన లెటరు నేను టైప్ చేసి పెట్టాలి. మర్చిపోతానేమో, ఇంటికి వెళ్ళగానే గుర్తుచెయ్యవా, ప్లీజ్.

నా తను: పి.ఎస్.టి.యు లెటరే కదా… నేను గుర్తుచేస్తాలెండి.

తన నేను: అబ్బా, చీ. ఏంటో అసలు. రోజూ చెప్దామనుకుంటూనే మర్చిపోతున్నాను. హెచ్.సి.యు లో పి.హెచ్.డి అడ్మిషన్ల నోటిఫికేషను వచ్చిందమ్మా. మనం అప్ప్లై చెయ్యాలి. మీ ప్రొఫెసర్‌గారితో ఒకసారి మాట్లాడాలి. రేపొకసారి గుర్తుచెయ్యి తల్లీ, మాట్లాడదాం.

నా తను: ఓకే

తన నేను: మనం తిరిగి వెళ్ళేటప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటే మంచిదేమో? అక్కడ పార్కింగ్‌లోంచి బండి తీసేటప్పుడు ఒకసారి చెప్పు, చూసుకుందాం.

నా తను: పోని, ఇప్పుడే కొట్టించేసుకోవచ్చు కదా?

తన నేను: గుడ్ ఐడియా….

పెట్రోల్ బంక్ బయటకి వచ్చిన తర్వాత…

తన నేను: బంగారం, మన ప్రింటర్‌లో కార్ట్రిడ్జ్ అయిపోయింది. మళ్ళీ మనకి ప్రింట్ అవసరమయితే కష్టపడకుండా ముందే ఫిల్ చేయించుకోవాలి, సరేనా?

నా తను: ఎప్పటిలోగా?

తన నేను: ఇంకో నాలుగు రోజుల్లో… అది సరేగానీ, ఇంతకీ రేపు నాకేం వండిపెడతావ్?

నా తను: చామదుంపలు ఉన్నట్టున్నాయండి.

తన నేను: సరదాగా, చామదుంపలతోపాటు బంగాళదుంపలు కలిపి కూర చెయ్యకూడదూ?

నా తను: మీరు తింటానంతే, మీ ఇష్టమండి. ఏదైనా వండుతాను.

తన నేను: ఏయ్ పిల్లా.. నీకు చాలా విషయాలు చెప్పేసినట్టున్నాను గుర్తుంచుకోమని. ఫర్వాలేదా? అన్నీ గుర్తుంటాయి కదా?

నా తను: ఒక్కసారి అన్నీ మళ్ళీ చెప్పరా? గుర్తున్నాయో లేదో…

Leave a comment