డబ్బుకి-తగ్గ-విలువ

“సార్, మనమేదో సహాయం చేద్దామనుకుంటున్నాం కానీ… మనమిచ్చే వస్తువులు, డబ్బులు నిజంగా వీళ్ళగురించే వాడతారా?” అడిగాడు సారధి. సమాధానం తెలుసుకునేలోపే, “నాకైతే ఈ వృద్ధాశ్రమం నడిపే పేరుతో, వీళ్ళే తినేస్తారేమో అనిపిస్తోంది” అంటూ తన ఉద్దేశాన్ని అక్కడే ఉన్న చంద్రిక వైపు చూస్తూ, నాకు మాత్రమే వినపడేలా బయటపెట్టాడు.

సారధి నేను టీచర్‌గా పనిచేస్తున్న కాలేజిలో పి.జి. చదివే విద్యార్ధి. విశాఖపట్నంలో వచ్చిన హుడ్-హుడ్ తుఫాను వల్ల జరిగిన నష్టాన్నించి కోలుకోవడానికి ఎందరో ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న సమయంలో, మా కాలేజీ పిల్లలు కొంతమంది వారి వంతు చేయాలని, ఆటల పోటీ ద్వారా, కొంత డబ్బు సేకరించారు. అయితే, వారి చదువు-పరీక్షల మధ్యలో ఆ డబ్బు కొంత విశ్రాంతి తీసుకొంది. కాని చంద్రబాబు మాత్రం పరిగెత్తేశాడు. నెల తర్వాత సహాయం చేద్దామన్నా, ఎవరికి చెయ్యాలో తెలీక సతమతమవుతున్న పిల్లలకి మరో మంచి ఆలోచన వచ్చింది. సేకరించిన డబ్బు, ఒక అనాధాశ్రమానికి, ఒక వృద్ధాశ్రమానికి పంచి విరాళంగా ఇవ్వాలని.

మంచి ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా, మంచిదే కదా!

పిల్లలకి తోడుగా, కాలేజినించి నేను వృద్ధాశ్రమానికి, మరో టీచర్ అనాధాశ్రమానికి వెళ్ళే భాగ్యం కలిగింది. అలా నేను, సారధి, ఇంకా మరికొంతమంది విద్యార్ధులతో వెళ్ళిన వృద్ధాశ్రమం నడుపుతున్న వృద్ధ మహిళ, చంద్రిక గారు.

సారధి ప్రశ్న నాకు కొత్తది కాదు. నిజానికి, బయట పడరుకానీ, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి ఖచ్చితంగా ఉపయోగపడుతుందా లేదా అనే ప్రశ్న చాలామందిని తొలిచేస్తూ ఉంటుంది. ఏ సమాధానమయినా సంతృప్తి పరచని ఆ ప్రశ్నకి నేను సారధికి ఇచ్చిన సమాధానం, చిన్న నవ్వు. మనసులో ఏమనుకున్నా, సారధి కూడా నవ్వి మరో మాట అనకుండా ముందుకు నడిచాడు. తననే చూస్తున్న ముసలి అవ్వని కలవాలి కదా మరి!

మమ్మల్ని దాటుకుంటూ ముందుకు పరుగెత్తి, “గుర్తుపట్టావా అవ్వా?” అని సారధి తోటి విద్యార్ధి రాఘవ ఆ ముసలి అవ్వని అడిగాడు. ఛత్వారమో, కొత్తవాళ్ళని చూసిన భయమో, ఆ అవ్వ తన కళ్ళు పెద్దవి చేసి తల పైకెత్తి చూస్తుంటే, అప్రయత్నంగా ఆవిడ నోరు కూడా తెరుచుకుంటూ తను మోసిన జీవిత భారాన్ని నిట్టూర్పులా వదులుతోంది. వయసులో ఉన్నప్పుడు, ఆ నిట్టూర్పులు లోలోనే దాయడానికి తన పళ్ళు, పెదాలు వాడెసిందేమో ఆ అవ్వ!

“ఆ… ఆ… నువ్వా బాబూ… మొన్న శనివారం వచ్చావు కదా?” అంటున్న అవ్వ, తన చేతులు ముందుకి చాపి, రాఘవ చేతులు పట్టుకుంటుంటే, నా మనసు పరవశించిపోయింది. ఒక్క నిమిషం, రాఘవ అదృష్టానికి సంతోషించినా, అది అతనింతకముందే అవ్వతో మాట్లాడి సంపాదించుకున్న ప్రేమ అనిపించగానే, నా విద్యార్ధి చేసిన మంచి పనికి గర్వం పాళ్ళు ఎక్కువయ్యాయి. మాటలైతే రాలేదుకానీ, రాఘవని ఆ అవ్వతో కొంచెం దూరమ్నించి చూడడం ఎందుకో గొప్పగా అనిపించింది. బహుశా, రాఘవ ఏం మాట్లాడతాడో అన్న ఆతృతతో కాబోలు?

“సాయిరాం… సాయిరాం… రా అయ్య. బాగున్నావా?… సాయిరాం…” అంటూ అవ్వ రాఘవకి తన పక్కనే మంచం మీద కొంచెం చోటు ఇచ్చింది. రాఘవ కూడా అవ్వచేతుల్ని పట్టుకుని, తన పక్కన కూర్చుంటూ తనతో వచ్చిన మిగతా వారిని పరిచయం చేశాడు. “అవ్వ… నాతోపాటు నా స్నేహితులుకూడా వచ్చారు నిన్ను కలవడానికి. ఇదిగొ సారధి, సుమన్, గణేష్, అగర్వాల్, సింఘ్, పటేల్, జ్వాలా, రూపాలి”.

తెలుగు అర్ధంకాని అగర్వాల్, సింఘ్, పటేల్, జ్వాలా… వారి ఇబ్బందిని మొహం దగ్గరకూడా ఆపలేక హింది మాట్లాడగలిగే అవ్వలెవరైనా ఉన్నారేమో వెతుక్కోవడానికి బయలుదేరితే, రూఫాలి మాత్రం, తెలుగు తెలిసిన రాఘవ కన్నా ఇష్టంగా అవ్వ కబుర్లు వింటోందేమో అనిపించింది నాకు. దగ్గరకి వెళ్ళి గమనిస్తే నాకర్ధమయింది, రూఫాలి భాష కన్నా ముందు బాధ్యత సరిగ్గా నేర్చుకుంది అని. ‘మేము ఉన్నాం’ అని సహాయం చెయ్యాడానికి వెళ్ళినప్పుడు, మనం వాళ్ళతో మాట్లాడటం కాదు, వారి విషయాలు ఓపికగా వినడం (అర్ధం అయినా, అవకపోయినా) ముఖ్యం అని అర్ధమయ్యేలా ఉంది రూపాలి వ్యవహరణ. వారి మాటలు వినేవారే ఉంటే, ఆ అవ్వలు వృద్ధాశ్రమానికి ఎందుకు వస్తారు?

హింది మాట్లాడే అవ్వ దొరికింది. మిగతా విద్యార్ధులందారూ ఆవిడతో వంటా-వార్పూ మాట్లాడటం మొదలుపెట్టారు.

నేను, రూపాలి దగ్గర ఉండి కొంత సహాయం చేస్తే బాగుండునేమో అనిపించింది. అలా అటుపక్కకి అడుగేస్తుండగా, చంద్రిక ఒక విషయం చెప్పారు. “మీ పిల్లలు ఇక్కడి వాళ్ళకోసం దుప్పట్లు, స్వెటర్లు తెచ్చారు. కానీ, నిన్నే మరో కుటుంబం వారు అవి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడివి ఏం చేయాలో…” అని ఆవిడ అంటూండగానే నేను ఒకసారి అక్కడ అవ్వలందరినీ, వారి సదుపాయాలని గమనించాను.

నేను దగ్గరగా ఉన్న అవ్వ దగ్గర స్వెటరుకానీ, కొత్త దుప్పటికానీ లేవు. నా ఆశో, అనుమానమో నేను ప్రకటించేలోపే, చంద్రికగారు కలుగజేసుకుని ఆ అవ్వని అడిగారు, “ఏవమ్మా. నిన్న ఇచ్చిన కొత్త స్వెటర్ ఎక్కడ?”. అంతలో, అక్కడే ఉన్న ఆయా కూడా చంద్రికగారితో గొంతు కలిపినట్టే అనిపిస్తున్నా, అవ్వకి సమాధానం చెప్పడానికి సహాయం చేస్తోందేమో అనికూడా అనిపించకపోలేదు. “ఆ.. అలా అడిగితే ఏం సెప్తాది? నిన్న రేత్రి అచ్చిన ఆల్ల మేనకోడలికి ఇచ్చేసిందిగా…” అంటూ గొంతు పెద్దదే చేసింది ఆ ఆయా, ఆ అవ్వ చెయ్యరాని తప్పేదో చేసేసినట్టు.

“చెప్పమ్మా, ఎంత కాలమైంది నువ్వొచ్చి? ఎలా చూసుకుంటున్నాం నిన్ను? నీ గురించి ఇచ్చిన వస్తువులు నీ మేనకోడలికిచ్చేస్తే ఎలా?” అని చంద్రికగారు కూడా… గద్దించారనే చెప్పాలి. నాకు రాని అనుమానానికి ఆవిడ సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినట్టు అనిపించింది నాకు. కాని, మరో క్షణం ఆలోచిస్తే, అమ్మ బిడ్డ కోసం తెచ్చిన బొమ్మ, ఆ బిడ్డ పారేసుకుంటే ఆ అమ్మకి ఉండే బాధే, చంద్రికగారూ పడుతున్నట్టు అనిపించింది. ఈ మరో ఆలోచనకి కారణం, ఆ అవ్వ ఇచ్చిన చిన్న సమాధానం, “నేనేంజేసుకుంటానమ్మా అయి… అదే నా మేనకోడలైతే సిన్న పిల్ల…”.

గొడవగా ఉన్న ఆ సందర్భంలో సరి కాదేమో? కానీ నాకొచ్చిన నవ్వు ఎందుకో ఆపుకోవాలనిపించలేదు. ఎందుకంటే, అవ్వ మీద చంద్రికగారి కోపానికి కారణం, మాతృప్రేమేనన్న భావన. అవ్వ, తన మేనకోడలికి స్వెటర్ ఇచ్చేయడం కూడా, ఆ మాతృప్రేమతొనే ఏమో? గొంతెత్తి అరిచే ఆయా భయమో (బాధో) కూడా బొమ్మ పారేసుకున్న బిడ్డ భయంలాంటిదే కదా! ఎవరికివారు సరైనదే చేశాం అనుకుంటున్నారు కానీ… ఏదో లోపించిందనీ ఒకరిని ఒకరు కూడా అనుకుంటున్నారు… అంతలో…

“నాకు డబ్బు కావాలయ్యా” అంటు హిందీ అవ్వ పిల్లలని అడుగుతోంది. పటేల్, ప్రేమతో కప్పిన తెల్వితో, “డబ్బేం చేసుకుంటావ్ అవ్వా?” అని అడుగుతున్నాడు. అగర్వాల్ కూడా ఆ అవ్వతో, “డబ్బెందుకు? నీకేం కావాలో చెప్పు, తెచ్చేస్తా” అని హామీ ఇస్తున్నాడు.

హిందీ అవ్వ మాటలు గట్టిగా వినపడ్డాయేమో? రూపాలితో ఉన్న తెలుగు అవ్వ, “ఓయమ్మా, ఈ ముసల్ది సిగ్గులేకుండా డబ్బడుగుతోందే… ” అంటూ, నా వైపు తిరిగి, “మొన్నే అయ్యా, నాది వంద రూపాయి నోటు కాజేసింది అది… పైగా ఎవురొచ్చినా అట్నే అడుగుతుంది అది” అంటూ తన భావం బయట పెట్టేసింది. తెలుగు అవ్వకి డబ్బు అవసరమై అలా అందో, లేక నిజంగా హిండి అవ్వ కాజేసిందో నాకు తెలియలేదు. తెలుసుకోవాలనిపించలేదు! చిన్నప్పుడు, ‘అమ్మా, వాడు నా బాల్ పారేసాడమ్మా’ అంటూ నేను మారాం చేసిన రోజులు గుర్తొచ్చి, మరోసారి నవ్వొచ్చింది–ఇది వృద్ధాశ్రమమా, లేక చిన్న పిల్లలు ఆడుకునే స్కూలా అని?

రాఘవ ఒక్కడే అటు ఇటూ తిరుగుతూ, అందరినీ పలకరించే ప్రయత్నంలో ఉన్నాడు. నేను గమనించే సమయానికి, హింది అవ్వతో తప్ప, తెలుగు అవ్వతో రూపాలి తప్ప, మరెవరూ ఎవరినీ కలవలేదు. ఆ ఉద్దేశం ఉన్నట్టు కూడా అనిపించలేదు. ఏమనుకున్నారో కానీ, చంద్రికగారు కూడా ఆఫీసుకి వెళ్ళిపోయారు. మరో పక్క పిల్లలని, నన్ను తీసుకువచ్చిన కాబ్ డ్రైవర్ దగ్గరకి వచ్చి తన పని గుర్తుచేశాడు, “సార్, తెచ్చినవన్నీ ఇచ్చేస్తే, మళ్ళీ కాలేజికి వెళ్ళాలి. వేరే పిల్లలుంటారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర దింపాలి”.

సారధి కనిపించలేదు. రాఘవని పిలిచి సలహా ఇచ్చాను, “మనం బయలుదేరితే మంచిదేమో” అని.

పిల్లలతో కలిసి తెచ్చిన సామానంతా, పప్పులు, బియ్యంతో సహా ఆఫీసులో జమ చేసేశాను. ఇక్కడ గమనించిన విషయమేంటంటే, ఆఫీసులో స్టోరు మొత్తం నిండిపోయింది. మేము తెచ్చిన సామానుకి సరిగ్గా స్థలం సరిపోయినా, ఇంతలేసి పప్పు, బియ్యం ఎంతకాలం నిల్వ చెయ్యగలరో తెలియలేదు. అయినా, నా బధ్యత పూర్తిచేసి బయటకి వచ్చే సమయంలో, చంద్రికగారు నన్నూ, రాఘవని, సుమన్‌ని ఆపి మంచినీళ్ళిచ్చి, చేసిన పనిని అభినందించారు. ఇంకా విద్యార్ధి దశలో ఉన్న రాఘవని, సుమన్‌ని ఉద్దేశించి చంద్రికగారు అడిగిన ప్రశ్న, “వృద్ధాశ్రమం కోసం ఇంత ఖర్చు చేశారు కదా! ఏం తెలుసుకున్నారు? ఏం అనిపించింది?”

సమాధానం కోసం ఆలోచిస్తున్న సుమన్‌కి మరో ప్రశ్నకూడా వేశారు చంద్రికగారు, “వచ్చాం, ఇచ్చాం, అయిపోయింది. అంతేనా? ఇంకేమైనా చెయ్యగలరా? కనీసం ఆ దృక్పథంలో ఆలోచిస్తున్నారా?” అని. రాఘవ మంచి నీళ్ళు తాగాడు. మనిషి జీవితాంతం విద్యార్ధే అని నమ్మే నేనూ ఆ ప్రశ్నలకి సమాధానం వెతకటం మొదలుపెట్టాను. ఆ సందర్భం ఎలా ముగిసిందో కానీ, సమాధానం మాత్రం దొరకలేదు.

బయటకి రాగానే నన్ను సుమన్ అడిగిన ప్రశ్న, “ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడెందుకడిగినట్టు సార్? ఆవిడ ఏమన్నా సలహా ఇవ్వాలనుకుంటే ముందే ఇచ్చి వుండొచ్చు కదా?” నేను మౌనం వహించాను. సలహా ఇవ్వగలిగితే చంద్రికగారు ఇచ్చివుండేవారే కదా! సొమ్ములిచ్చి (లేదా వస్తువులిచ్చి) ఏదో మంచిచేసేశాం అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉండే రోజుల్లో, ఆలోచనా పరిధి చంద్రికగారి ప్రశ్నలకి సమధానం ఇచ్చేంత పరిణితి చెందలేదనిపించింది.

అక్కడే, మాకోసం వేచి ఉన్న మిగతవారిలో సారధి చొరవ తీసుకుని చెప్పిన తన ఆఖరి మాట, “అంతేలే సుమన్. నేను చెప్పానుగా! వీళ్ళంతా వృద్ధాశ్రమం నడిపే పేరుతో డబ్బు ఆశించే వాళ్ళే అని”. కించిత్ బాధగా అనిపించింది నాకు; పిల్లలు ఇంత చేసినా, వారి ఉద్దేశంలో అనుమానం మిగిలిపోయిందే అని.

ముందడుగు వెయ్యగానే, “ఆకలేస్తోంది. ఎక్కడికైనా మంచి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చెయ్యాలి” అంది జ్వాలా.

“ఖర్చేమో?” అన్నాను నేను ఆతృతతో. “ఎప్పుడో ఒకసారి కదా సార్” అని సమాధానం చెప్పాడు సారధి.

అవకాశం ఇచ్చాడు నారాయణుడు. వదులుకోలేక అడిగా, “పెట్టే ఖర్చుకి తగ్గ భోజనం పెడతారంటావా రెస్టారెంట్లో?”

“అబ్బా, ఎదోలెండి సార్. ఎప్పుడొ ఒకసారి చేసేదానికి ఎందుకంత ఆలోచించడం?” అని తన ప్రశ్ననో (సలహానో) సమాధానంగా ఇచ్చారు పిల్లలు.

“మరటువంటప్పుడు, ఎప్పుడొ ఒకసారి మీరు ఇచ్చే విరాళం సరిగ్గా వినియోగిస్తారో లేదో అని ఎందుకింత ఆలోచించారు? నిరంతరం వృద్ధులకోసం శ్రమించే మనిషిని, వ్యవస్థని ఎలా అనుమానించారు?”, నేను నెమ్మదిగానే నిలదీసాను. ఈసారి మౌనం వహించడం పిల్లల వంతైంది.

పరిస్థితి మారలేదు. పిల్లలు భోజనానికి బయలుదేరారు, నేను కాలేజికి తిరిగి వచ్చాను.

ఈ నా అనుభవంలో ఎన్నో ప్రశ్నలున్నా, నా మది తొలిచేసే ఒకే ఒక ప్రశ్న, ఈ కధలోని ప్రశ్నలన్నిటికీ మూలం.

డబ్బుకి-తగ్గ-విలువ అనేది సేవ చేసేటప్పుడే ఎక్కువగా ఎందుకు గుర్తొస్తుంది?

Leave a comment