జరిగినది గంటన్నరే అయినా విషయం మాత్రం చెప్పుకోదగినది. మొత్తానికి, షిరిడీ బాబావారి పిలుపు వచ్చింది. బాబావారికి రోజూ జరిగే సంగీతసేవలో, ఈ నెల ఆరవ తారికున, మంగళంపల్లి సూర్యదీప్తిగారి వయోలిన్‌కి, మా ఆవిడ కళ్యాణి మృదంగ సహకారం అందించింది. ఇంకా గొప్ప విషయమేంటంటే, గాత్రంలో మా అమ్మ, నా చెల్లి కూడా జ్యోత్స్నగారితో గొంతుకలిపేశారు. అందులోనూ, మా అమ్మ, తను రాసిన పాటలు పాడుతుంటే, అబ్బో, నాకు మహా గొప్పగా అనిపించిందిలెండి. సంగీతసేవ ముగియగానే, స్వామివారి దర్శనానికి ఆలయంవారే తీసుకెళ్ళారు. మహాద్భుతంగా, కన్నులవిందుగా బాబాని చూసేసి, ఆ రాత్రికి ‘సాయి రత్నా’ అనే హోటల్లో గది తీసుకొని విశ్రాంతి చేశాము.
మరుసటి రోజు గురువారము. బాబాస్వామిని చూడ్డానికి ప్రపంచ ప్రజానీకం అంతా షిరిడీ వచ్చేసిందేమో అనిపించే రోజు. ఆ మరుసటి రోజు, శుక్రవారము. మాములు శుక్రవారము కాదు, శ్రావణ శుక్రవారము. అంటే, మా అమ్మ, ఆవిడ, చెల్లెమ్మ వరలక్ష్మీ వ్రతం చేసుకునే రోజు. మాకు రెండు విషయాల వల్ల గుబులు పట్టేసుకుంది. ఒకటి, గురువారం బాబా దర్శనం దొరుకుతుందా? రెండు, గురువారం సాయంత్రానికి బయలుదేరే అజంతా ఎక్స్ప్రెస్స్ కి, మా ట్రైన్ తిక్కెట్లు కన్‌ఫర్మ్ అవలేదు!
మొదటి విషయం బాబావారు బహుబాగా హాండిల్ చేశారు. పొద్దునే సాయి సత్యవ్రతం చేసుకున్నాం. తర్వాత అదే రోజు, రెండుసార్లు దర్శనం చేసుకున్నాం. ఆశ్చర్యపోయే విషయమేంటంటే, స్వామి నా చిరాకుని గమనించి మా అమ్మకి, ఆవిడకి సాయం చేసినట్టు, మాములుగా గంటలు పట్టే దర్శనం, మేము వెళ్ళిన రెండుసార్లుకూడా, పది-పదిహేను నిమిషాలు మించలేదు.
రెండొ విషయంలో గుబులు మాత్రం అలానే మా బుర్ర తినేసింది. మన వెధవ ఐ.ఆర్.సి.టి.సి సిస్టం ఎప్పుడు సరిగా పనిచేసి చావదు. మొత్తానికి, సాయంత్రం ఏడుగంటలకి తెలిసింది ఏంటంటే, మొత్తం కుటుంబానికి, అంటే ఆరుగురికి ప్లస్ మా రాముడికి, మూడే బెర్త్‌లు కన్‌ఫర్మ్ అయ్యాయి. అక్కడితో మా ఎగ్‌జాం అవలేదు. షిరిడీ నించి నాగర్సోల్ వెళ్ళాడానికి 44-కిలోమీటర్లు జర్నీ. మేము నాగర్సోల్ లో ట్రైన్ ఎక్కాలి. షిరిడీ నించి మాములుగా అయితే వాన్‌లు, జీప్‌లు తిరుగుతునే ఉంటాయి. మరి మేం మాకే తెలీని ఎగ్‌జాం లో ఉన్నాం కదా! మాకు దాదాపు ఎనిమిదింటి వరకూ ఏది దొరకలేదు. తొమ్మిదిన్నర కి ట్రైను. చివరాఖరికి, వైజాగ్ గీతం ముందు ఆటో వాళ్ళు కూడబలుక్కుని మిగతా వాళ్ళని ఎలా పనిచేసుకోనివ్వరో, షిరిడీలో కుడా అలాంటి సీనొకటి చూసి, ‘సినిమా కనపడి పోతోంది రా బాబా…’ అనుకునే టైంకి ఒక వాన్‌వాడు మా గురించే వచ్చినట్టు వచ్చి, ‘సినిమా నేనూ సూపిత్తా..’ అన్నట్టు దారిలో నాలుగుసార్లు పెట్రోల్ కోసం ఆపి, ఎలాగైతేనేం, ట్రైన్ రావడానికి పది నిమిషాలముందే మమ్మల్ని నాగర్సోల్ చేర్చేశాడు.
ఇక అజంతాలో మా అగొనైజర్, మూడు బెర్త్‌లు. ఎలా వచ్చాం అని నేను చెప్పఖర్లేదెమో! బెర్త్‌కి ఇద్దరు చొప్పున విశాలంగా కాళ్ళు చాపుకుని, అనువుగా ఒకళ్ళ మీదకి మరొకళ్ళు జారబడి, వద్దన్నా మరీ రెక్స్‌పెక్ట్ ఇచ్చేసే విండో ఎ.సితో రాత్రంతా ‘చలి చలిగా ఉంది సుమా..’ అనుకుంటూ వచ్చేసాం. వచ్చేసరికి టైం పదకొండు. పూజ మొదలయ్యేసరికి పన్నేండు. మా అమ్మ, ఈ రోజు మొత్తానికి చేసే మొదటి భోజనానికి, ఇదిగో ఇప్పుడే, ఆరున్నొక్కటి. ఇప్పుడింక, కడుపులో పాడే సంధ్యారాగాలకి నేనుకూడా జతకలిపేసి, పులిహోర తినేసొస్తా.
వీలు కుదిరినప్పుడు మళ్ళీ ఇలానే ఎవో కబుర్లు తెస్తా!