ప్రొద్దున్నే ఆకలికి, త్వరగా జలకమాడేసి, ఆదిత్య హృదయం గమ్మున చదివేసి, తువ్వాల్లోంచి ట్రౌజర్ లోకి జారి, జంధ్యం దులుపుకుంటూ, తూర్పుదిక్కుకి తిరిగి వరండాలోకి చూస్తూ, ఎడమవైపు అమ్మ పూజ కార్యక్రమం, ఆవిడ పాడే “ఒక పరి కొకపరి..” కీర్తనకి, కుడివైపు వంటగదిలోంచి గళం కలుపుతున్న మా ఆవిడనీ వింటూ, నిన్న రాత్రి మిగిలిన ప్రసాదం, పులిహోర, తినడానికి కూర్చున్నాను. మా అమ్మ కన్నయ్య, మా నాన్న రాముడు, మా ఆవిద చిన్నవాడు, మా చెల్లి కి ముద్దుల అల్లుడు, నా చంటోడు, మా మనోసాయి రాంభరత్, అక్కడక్కడే తచ్చాడుతూ, చేతికి దొరికినదాన్ని, బయటకి విసురుతూ, బయటపడినదాన్ని లోపలకి తెమ్మని వారి తాతగారికి ఆర్డరేస్తూ, అప్పుడప్పుడూ కొలువులో మిగిలిన సభ్యులేంచేస్తున్నారో గమనిస్తూ, వారికి మాత్రమే అర్ధమయ్యే భాషలో కవిత్వం చెబుతూ, అందరినీ అలరిస్తున్నారు. కానీ వారికైనా ఆకలి తప్పదు కదా! మా ఆవిడ, చిన్నోడికోసం, ఆపిల్ చెక్కుతీసి, చిన్న ముక్కలుగా కోసి, చిన్న కప్పులో వాడ్డించింది. అయితే, నా ఆసనం నేను చూసుకున్నట్టే, మరి మా రాజుగారు చూసుకోవాలిగా! వారి ఆసనం, నేనే! ఇక డైనింగ్ టేబుల్ అంటారా, అరిటాకులో భోజనం అంటే ఇష్టపడేవాడికి అది అలంకారప్రాయమేకానీ మరొకటి కాదు. కాబట్టి, నేను భూదేవిమీదా, నా చంటోడు నామీదా, తినడానికి సిధ్ధమయ్యాం.
మావాడు చిన్నప్పుడే చాలా మంచి అలవాట్లు నేర్చుకున్నాడు. వాటిలో ఒకటి, వాడు ఏదన్నా తినేముందు, పక్కవాళ్ళకి కొంత పెట్టడం. బాగుంది కదండీ! అయితే, ఆ సంగతి మర్చిపోయిన నేను, పులిహోరని నా ఆత్మారాముడికి సమర్పిస్తే, నా వొడిలో నా రాముడు, ఆపిల్ సమర్పించాడు. విషయం వివరించే అవకాశం ఉంటే బాగుండుననిపించినా, ఆ చాన్స్ లేకుండా, మొత్తానికి, పులిహోర, ఆపిల్ పండు, కలిపి స్వాహాచేశాను. సరే మరి, మంచి అలవాటు కదాని, మా రాముడికి అదే రుచి చూపించాలనుకున్నా కానీ, సారువారు చాల సింపుల్‌గా నవ్వేసి మరో ఆసనం అలంకరించారు. వారి అమ్మవొడి!
నాకిప్పటికీ అర్ధంకాని విషయమేంటంటే, భగవంతుడు ఇంత తెలివిని అల్లరి రూపంలొనే ఎందుకు ప్రకటింపచేస్తాడూ అని. నా భావం అర్ధమయ్యుండకపోతే, మీరుకూడా, పులిహోరా-ఆపిల్పండూ కలిపితినండి, ఆ పక్కనే మిమ్మల్ని చూసినవ్వే వాళ్ళనీ ఉంచుకోండి. ఏది ఏమైనా, పిల్లల అల్లరి మాత్రం అనుభవించండి. జిహ్వలో కన్నా, వాళ్ళ అల్లరిలో ఆనందం ఎక్కువే!