డియర్ మనిషి… నీతోనే, నీకోసమే: దేవుడు

డియర్ మనిషి

ఒక రంగుల ప్రపంచం ఉంది. అందులో నువ్వూ ఉన్నావు. మీలో చాలామంది ఎందుకు పుట్టానో, ఏం చెయ్యడానికి ఉన్నానో అనే ప్రశ్నలతో జీవితం గడిపేస్తుంటారు. నువ్వు గమనించావో లేదో! ఈ ప్రశ్నలువేసేవారే అయితే నన్ను నమ్మమని చెప్తారు, లేదా నిన్ను నమ్ముకోమని చెప్తారు. కాలం తిరగేసి చూస్తే, ఈ కోవలకి చెందినవారు ఆధ్యాత్మిక వాదులుగానో, లేదా భౌతికవాదులుగానో లెక్కించబడుతున్నారు. చిత్రమైన సంగతేంటో తెలుసా? మనిషి కాలంచేసిన తర్వాత, తన సమాజం చూసే మిగులులు భౌతికాలు, తన అంతర్లోకంలో ఉండి తనతోనే సమాధిచెందే భావాలు ఆధ్యాత్మికాలు. నీ దృష్టికి బాహ్యంలో పదార్ధం కనిపిస్తే, అంతరంగంలో భావం తెలుస్తుంది.

చాలామంది నీకు ఇదివరకే చెప్పుండొచ్చు, జీవితం మంచి చెడుల మధ్యే సాగుతుంది అని. మరికొంతమంది ఇదే విషయం ఇంకోలా చెప్తారు–నేను మీకిచ్చిన విచక్షణ మీకుమీరుగా చెడుని వదిలి మంచిని అనుసరిస్తారని. కానీ అసలు విషయం ఏంటో నా సఖ్యులు కొందరు ఇదివరకే విన్నవించినా, నేనూ ఒకసారి ఇక్కడ గుర్తుచేద్దామనుకుంటున్నాను. మంచి-చెడు అనేవి నిజాలు కాదు, అవి వాసనలు మాత్రమే. పుణ్యం-పాపం అనేవికుడా రెండూ కర్మలే, ఏది మిగుల్చుకున్నా, ఆ భారం దింపుకోడానికి మరో జన్మ తప్పదు.

ఏమిటి, ఆధ్యాత్మికమనుకుంటున్నావా? ఒకసారి నాతో కలిసి మళ్ళీ ఆలోచించు.

క్రియ-ప్రక్రియల మధ్య కోలాహలం, మనుషులు చిత్రిస్తున్న శాస్త్రం. శోధన ఇక్కడి మార్గం. ఆధారం ఇక్కడ అవసరం. ఎంత భౌతికం? ఇంత శూలశొధన తర్వాత మనిషి చేరే గమ్యం? అతను చిత్రించిన శాస్త్రం ఏ స్థలపరీక్షకో, కాలపరీక్షకో నిలబడి మార్పుపొందడం. ఈ మార్పు ఎటువంటిదో నీకు తెలుసా?

భావంకోసం సిధ్ధాంతం, పదార్ధంకోసం ఆచారం, ఈ రెండితి అన్వయంకోసం ఎన్నో సమస్యలని పరిష్కరిస్తూ, మరెన్నో ప్రశ్నలకి సమాధానాలిస్తూ, నేను చెప్పిన మాటలు శాస్త్రం కావంటావా? నీ బుధ్ధికి అర్ధమయ్యేవరకూ, నీ మనసుకి తృప్తినిచ్చేవరకూ సరిపోయే ‘భాగవతం’ శాస్త్రమని నీకనిపించలేదా?

తర్కంతో శోధిస్తే అభూతాలు కల్పితాలనిపిస్తాయి. సృష్టిలో నిబిడీకృతమైన కల్పనలనిచూస్తే భౌతికాలు నిర్వేద్యంగా అగుపిస్తాయి. ఇక నా సలహా ఒక్కటే. నీ చుట్టూ ఉన్న పంచభూతాలని ఎలా గుర్తించావో, అలాగే నా ఉనికిని గుర్తించు. అది నీ క్రియలతో ముడిపడ్డ ఆలొచననే సాధనంవల్ల తెలిసేది కాదు. మన సంబంధంతో ముడిపడ్డ అనుభవం. నాతో సంబంధం భూతాభుతాలకి భావాబేధాలకి అతీతం.

నా అడ్రెస్స్ కావాలంటే, నా భక్తులని అడుగు. మాట్లాడటానికి ఇబ్బంది అయితే, భాగవతం చదువు. చదివే సమయంలేకపోతే నా గురించి మాట్లాడేవాళ్ళని విను. వాళ్ళని వినాలని అనిపించకపోతే నన్ను ఒక్కసారి తలుచుకుని చూడు… నాతో నీ ప్రయాణం సుగమం చెయ్యడానికి నేను మొదటి మెట్టుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు ఇది చదివేటప్పటినించి నేను నీతో ఉన్నానని గుర్తిస్తే, మన సఖ్యత చాటడనికదే తొలిమెట్టు.

నీతోనే, నీకోసమే
దేవుడు

మనసు కోతికి కమ్మ్యూనికేషన్ కలవరం

లిసన్ టు మి ఫస్ట్” అన్నారా పెద్దాయన.

ఆయనతో నాలుగు కబుర్లు చెప్దామని బయలుదేరిన అతనికి, ఈ మాటే పదే పదే వినిపిస్తోంది.

ఆయన: “డు యు నో దిస్? ఆన్సర్ టు మి.”
అతను: “వాట్ దట్ మీన్స్ ఈజ్…”
ఆయన: “నో నో… లిసన్ టు మి, వాట్ ఐ ఆం ఆస్కింగ్ ఈజ్…”
అతను: “ఎస్ సర్, ఐ గెట్ యు. లెట్ మి ట్రై ఎగైన్.”
ఆయన: “సీ దిస్. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో, యు హేవ్ నాట్ హర్డ్ ద క్వెస్చన్ ప్రాపర్లీ.”
అతను: “నాట్ దట్ వే సర్. ఐ ఆం లిసనింగ్ టు యు…వాట్ ఐ ఆం ట్రయింగ్ ఈజ్…”
ఆయన: “యూ లిసన్ టు మి ఫస్ట్. యు కెనాట్ కమ్మ్యూనికేట్ అన్లెస్స్ యు లిసన్ ఫుల్లీ.”
అతను: “…   …   …”

ఈ సంభాషణ మీకు ఎదురైందిగానో, ఎక్కడో విన్నట్టుగానో ఉంటే, నా మనసు కోతికి వచ్చిన ప్రశ్న మీక్కూడా వచ్చేవుంటుంది. ఈ ‘అతనూ, ‘ఆయన’ ల్లో ఎవరు మంచి సంభాషకులు అని, అదే కమ్మ్యూనికేటరు అని. ఆయనేమో, “నన్ను విను”, “ముందు విను” అని అంటున్నాడు. అతనేమో, “మరేదో” చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు.

ట.త: ఇద్దరికీ కమ్మ్యూనికేషన్‌లో సమస్యలున్నాయని మీరంటే మాత్రం, ఈ టపాని మళ్ళీ చదవండి. నాకెందుకో పంచతంత్రంలో విష్ణుషర్మ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఉపదేశాలివ్వడానికి అందరూ పాండితులే, కానీ ఇచ్చే ఉపదేశాలని పాఠించే మహానుభావులే అరుదు అని.