ఇదేదో సినిమా కధ కాదులెండి. ముప్ఫైకి దగ్గర పడుతున్న నా భార్యకి, తన తమ్ముడెక్కడున్నాడో తెలిసింది. పది సంవత్సరాల క్రితం స్వర్గస్తురాలయిన మా అత్తగారికి, అంటే నా అర్ధాంగి తల్లిగారికి, ఒక చెల్లెలున్నారు. ఆవిడకి ఇద్దరు పిల్లలు, అమ్మాయి పెద్దది, అబ్బాయి చిన్నవాడు. వీరి కుటుంబానికి, ఇప్పుడు నా ఎడమసగమైన కుటుంబానికి, మనకిప్పుడు అనవసరమైన కారణాల వల్ల, సంప్రదింపులుకానీ, సంభాషణలుకానీ లేవు. దేవుడు మహా చిత్రాలు చేస్తాడు కదా! ఇంత కాలం తర్వాత అనుకోకుండా, ఫేస్‌బుక్ ద్వారా, అక్కాతమ్ముళ్ళు కలిశారు.
అక్కకి పెళ్ళయ్యి, పిల్లాడుకూడా పుట్టిన సంగతి తెలీగానే, తమ్ముడు అక్కనీ, బావనీ చూడ్డానికి చాలా ఉబలాటపడ్డాడు. సర్వేశ్వరుడు మనం కోరితే కాదంటాడా? ఆ తమ్ముడికి ఎంతో కాలంగా ఐ.బి.ఎం నుంచి రావల్సిన జాయినింగ్ ఆర్డర్స్ వచ్చాయి. పోస్టింగ్ ఎక్కడనుకుంటున్నారు? వాళ్ళ అక్క ఉండే ఊరే, మన హైదరాబాద్.
జాయినింగ్‌కి కొద్దిరోజుల ముందే వచ్చిన తమ్ముడు, అక్కని కలవడానికి, వర్షాన్నికూడా లెక్కచెయ్యకుండా వచ్చి కలిసేశాడు. చిత్రమేంటంటే, హైదరబాద్‌లో సగం జనాభా ఎప్పుడూ ఏదో ఒక పనిమీద రోడ్డుమీదే ఉంటుంది. అలాగే, ఆ అక్క, తన ఆడపడుచుని వారి అత్తింట్లో దింపిరావడానికి బయలుదేరే సమయమది. ఓ పక్క తమ్ముడొచ్చిన ఆనందం, మరో పక్క ఆడపడుచు బాధ్యత. ఏం చేస్తుందీ అక్క? ఆ తమ్ముడినికూడా చనువుతో, తనతోపాటే బయలుదేరమంది. అసలే వర్షంలో వచ్చిన తమ్ముడు, ఎంతో కాలం తర్వాత కలిసిన అక్క మాట కాదనలేక, బండితీసి మళ్ళీ తడవడానికి సిధ్ధమయ్యాడు.
ఇక చిన్నాచితకా విషయాలు పక్కనే పెట్టి రీలుతిప్పిచూస్తే, ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఆ తమ్ముడికి రెండు చిన్న ఏక్సిడెంట్లు, కాలికి ఒక దెబ్బ, చిరిగిపోయిన జీను మిగిలాయి. ఆ అక్కకేమో తమ్ముడిని బాగా ఇబ్బంది పెట్టేశాను అన్న భావన మిగిలింది. విచారించగా తెలిసిందేంటంటే, ప్రేమకూడా కొన్ని ఇబ్బందులు తెస్తుంది అని.
ఓహ్, అసలు సంగతి చెప్పటం మర్చిపోయాను. మా ఆవిడ తమ్ముడి పేరు, మల్లీశ్వర్.
తర్వాత ఏం జరిగిందంటారా? రాత్రివస్తే, పగలు రాకమానదు కదా! అలాగే, అక్కాతమ్ముళ్ళిద్దరూ రాత్రింబవళ్ళూ కబుర్లతో గడిపేసి, పొద్దున్నే ఎవరి కొత్త ఇబ్బందులు వారు పరిష్కరించుకుంటున్నారు.