భయమేసింది… మీరేమైనా సలహా ఇస్తారా?

నాలుగు వందల టపాలు రాసిన తర్వాత నాకు కొంచెం భయమేసింది. కర్ణుడి చావుకన్నా ఎక్కువే ఉంటాయి కారాణాలు, కానీ బ్లాగడం ఆపాను. ఇప్పుడు మళ్ళీ రాస్తానంటే నా రాతల్ని కపిత్వంతో, నా పెర్సనాలిటినీ పైత్యంతో ముడిపెట్టి హింసిస్తారేమోనని కొంచెం జంకుగా ఉంది. అయినా సరే అని ఇవాళ తెగించేశాను. రాస్తే ఏమవుతుంది, మహా అయితే మరో కామెంట్ రాస్తారు. రాసి చూద్దామని మొదలెట్టాను. సర్లేండి, సినిమా కబుర్లు కావివి. నిజంగా…

ఏదో దేవుడి దయవల్ల, నాకు ఈ మధ్య కొంచెం దైవచింతన పెరిగింది. అంటే మీరు అర్ధం చేసుకున్నారో లేదో…అడక్కుండా వచ్చే ఎస్.ఎం.ఎస్ ఆఫర్లకి తెలీక క్లిక్ చేస్తే వచ్చినట్టు, కొన్ని సమస్యలు వచ్చాయ్; ఏం చెయ్యాలో తెలియని సమయంలో, అనుకోకుండా బుక్కైపోయిన తత్కాల్ టికెట్లాగా, పరిష్కారం దొరికింది. ఈ చివర నిలబడి దేవుడిని అడగాలనిపిస్తుంది “స్వామీ, నిన్నెప్పుడూ  స్మరించగలిగే శక్తినివ్వు” అని. ఆ చివర చూస్తే, “స్వామీ, నన్ను కష్టాలనించి బయటపడేసే పని పెట్టుకోకపోతే, అసలు కష్టాలే లేని జీవితం ఇస్తే బాగుండేది కదా” అనీ అనిపిస్తుంది. ప్రస్తుతానికి, దేవుడిని ప్రశ్నించడం మాని, పలకరిస్తుంటే మంచిదని, అవసరంలో తోడుంటాడని డిసైడ్ అయ్యాను. పైగా వేంకటేశుడంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మాత్రం స్పష్టంగా చెప్పలేను. బంగారు వాకిలిలో అడుగుపెట్టిన క్షణం నించి విమాన వేంకటేశుడి దర్శనం అయ్యేవరకూ, ఏదో చాలా హాయిగా ఉంటుంది మనసుకి. జీవితంలో కష్టసుఖాలు మరచిపోయే మధురక్షణాలవి.

సరే మరి. అసలు చెప్పాలనుకున్న విషయమేంటంటే, నేను ఇకముందు  ఏం రాస్తానో నాక్కూడా అంతగా అంచనా లేదు. కాని, రాస్తే నలుగురితోనూ కాస్త కబుర్లు పంచుకున్నట్టు ఉంటుందనిపిస్తోంది. నేను రాస్తే చదివే ఆ నలుగురూ ఎవరై ఉంటారో, వాళ్ళకి ఏం కబుర్లు చెప్పొచ్చో అని ఆలోచిస్తున్నాను. మీరేమైనా సలహా ఇస్తారా?

మనసులో ఆట, బయట దొంగాట

నేను బయట ఊరెడతానని వాడికి చెప్పడం తప్పలేదు. అదే ఒక రకం ఖర్మ. దీనికి తోడు వాడు నన్ను పనికిరాని, అసంబధ్ధమైన, దిక్కుమాలిన ప్రశ్నలేసేటప్పటికి, నాకొచ్చిన చిరాకుకి, నా మనసులో ఒక ఆట, కానీ సమాజం కోసం, బయట దొంగాట.

నా కష్టాన్ని తీరుస్తాడని, వాడికి సమస్య మొత్తం చెబితే; వాడిచ్చిన చెత్త సలహా: “ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనం వాళ్ళతో మెలగడం నేర్చుకోవాలి”. నా ఉద్దేశంలో ఈ సలహాకి అర్ధం: “సారీ! నేను నీకు సహాయం చేయదల్చుకోలేదు. ఎందుకంటే, అవతల వైపు ఉన్నవాడు నా చంకలో తల దాచుకుంటున్నాడు”. నా ఉద్దేశం, నా మనసులో ఆట. బయట జరిగే దొంగాట, సలహాకి ధన్యవాదాలు: “అర్ధమైంది సార్, మీరు చెప్పింది ప్రయత్నిస్తాను”.

నా కధ నేను రాసుకుంటుంటే, “నా కళ్ళతో అయితే కధ ఇంకోలా రాయచ్చు” అనే వాడు తగిల్తే ఏమనిపిస్తుంది? నా మనసులో ఆట: “కధ నాది కదరా”. బయట దొంగాట: “నిజమేనండీ! ఎంత బాగా గమనించారో”.

“పని మొదలెడతాను మహాశయా” అని నేనంటే, అవతలివాడు “అసలు శెలవు ఎందుకు పెట్టావో చెప్పు, ఆ తర్వాత పని గురించి మాట్లాడదాం” అనే వాడు ఎదురైతే, మీకేమనిపిస్తుందో? నా మనసులో ఆట మాత్రం: “నీకు పని కావాలా, లేక కారణాలు కావాలా?”. బయటకి, నా ఖర్మకి, సమాజంలో మెలిగే అతితెలివి సొగసుకి, నా మాట: “అంటేనండీ.. అప్పుడు మీకు చెప్పి వెళ్ళాను కదా.. మరి ఇప్పుడు.., .., అలాగేనండీ, మీరెలా చెప్తే అలానే. ఆయ్, చిత్తం!”

నేను కనపడలేదని, నన్ను అడగకుండా, నేనేంచెయ్యాలో నిర్ణయం చేసాడొకడు. అందులో సమస్య ఉంది, ఆ పని, ఆ రోజు నేను చెయ్యలేను అని మొర పెడితే, వాడిచ్చిన సమాధానం: “అయితే, ఇంకొకరి చేత చేయించు”. మనసులో మాట: “ఒరేయ్ పిచ్చోడా! బధ్ధకస్తుడా! నువ్వు చేసిన తప్పుకే, నేను తల పీక్కుంటున్నాను. పైగా, నన్నుకూడా తప్పు చేయమని (అదే, నీ పని చేయమని) సలహాలిస్తావా?”. కానీ బయట మురిపెంలో దొంగాట: “సరేలెండి, మీరు మాత్రం ఎంత పని చేయగలరు”.