దైవమిచ్చిన వరం

పదుల్లో అమ్మకి నచ్చే కోడలు రావాలనుకున్నా
పదహారులో అందమైన భార్య కావాలనుకున్నా
ఇరవైల్లో అర్ధంచేసుకునే అర్ధాంగి చేయిపట్టాలనుకున్నా

దేవుడు అన్నీ వింటాడు, అన్నీ చేస్తాడు!
ఎక్కడెక్కడి మనుషుల్నో కలిపేస్తాడు!
ఆయన విధానాలు ఒక వింత,
ఆయన లీలలు చక్కని గిలిగింత.

నా ఇంటి దీపం వెలిగించడానికి వచ్చిందో చిన్నది
తన చూపు చాలు, ఇక అందం గురించి చూడనేల?
తన నడక చాలు, ఇక తీరుతెన్నుల గురించి అడగనేల?
తన అల్లరి చాలు, ఇక చిలిపితనం గురించి వెతకనేల?
తన స్పర్శ చాలు, ఇక ఆనందం గురించి చింతేల?
తన సహవాసం చాలు, తనకన్నా జీవితానికి అర్ధమేల?

తలచుకుంటే నవ్వొస్తుంది,
ముప్పైలు దగ్గరపడుతుంటే అనిపిస్తోంది,
నేను భార్యని అడిగితే, దేవుడు,
నాకు అమ్మని, బొమ్మని, కూతురుని కలిపి ఇచ్చాడని!

ఓర్పుకి సత్యభామలా కూతురైతే,
కూర్పుకి సరస్వతిలా తల్లయితే,
ప్రేమకి రాధలా బొమ్మయింది.

అదే నా చిన్నది, నా కన్నుల పంటది.
నన్ను కళ్యాణవల్లభుడిని చేసిన దేవుని వరమది.

నాతో నాకే, చిన్న మాట

ఆలోచన చలిస్తే…
పని పెనుభూతమయితే…
అనుమానాలు పుట్టగొడుగుల్లా మొలకెత్తితే…
ఆవేశాలు విచ్చలవిడిగా చెలరేగితే…
ఓపిక నశిస్తే…
చిరాకు పరాకాష్ట చేరితే…
భయాలు నిజమయితే…
పూజకు దూరమయితే…

ఈ భావన భారమయినా, నిజానికి చేరువయితే…

ఏమిటీ జీవితం? ఎందుకీ జన్మ?

చిరునవ్వులొలికే అర్ధాంగి మోము, వేన్నీళ్ళకి చివికిపోయినా…
నవ్వులుపంచే రాముడి కళ్ళలో, నా వెనక శూన్యం చూసినా…
అరవైలోకూడా, తనకోసం కాక తనయుడి కోసం కష్టించే తండ్రిని చూసినా…
అనారోగ్యంతో ఉన్నా, కొడుకు మనసుకి నొప్పి కలగకూడదని, నవ్వే తల్లిని చూసినా…

వారికోసం ఏమీ చెయ్యలేకపోయానని మది ద్రవిస్తుంది,
అసలేమైనా చెయ్యగలనా అన్న ప్రశ్న నరాలన్నింటిని వణికించేస్తుంది.

తానోకటి తలిస్తే, దైవమొకటి తలచాడట!
నేనేమి తలచానో? దాని ఫలితం తెలిసేలా చేశాడు దైవం.
ఇక తలపులేల, దైవముండగా!

నారాయణ నామ స్మరణకి దూరమయిన నేను,
మళ్ళీ ఆయన అయస్కాంత శక్తికి లొంగగ తప్పదు.
ఆయనకి సేవ చెయ్యడం నాకు ఇష్టం,
చేయలేకపోవడం, నా కర్మ ఫలితం.

ఇంకా ఎంత కాలమో, కర్మతో నా ఈ చెలగాటం?

ఓం నమో వేంకటేశాయ||