రక్తాసురుడికి ఒక లక్షణం ఉంది. వాడిని చంపినాగానీ, వాడి రక్తం నేల చిందగానే, వాడు ఎన్ని రక్తపు బొట్లు చిందాయో అన్నిసార్లు మళ్ళీ పుడతాడు. వీడిని చంపడానికి అమ్మ కాళి అవతారం ఎత్తి వాడిని చంపి వాడి రక్తం నేల చిందేముందే తాగేసింది. అలాంటి నీచుడి రక్తం, ఆ అమ్మ, మనని వాడినుండి రక్షించడానికి తాగింది. అది ఆ తల్లి ప్రేమ!
ప్రాపంచికమైన కోరికలు ఆ రక్తాసురుడిలాంటివే. ఒకటి తీరితే బాగుండును అనుకుని ముగించే లోపలే మరొకటి పుడుతుంది–ఇది కూడా అయితే ఎంత బాగుండునో అనిపించేలా. మరి, తెలిసి తెలిసి, అలాంటి కోరికలు మనం పెంచుకుంటే ఎలా? అయితే అమ్మ మన గురించి మళ్ళీ కాళీ అవతారం ఎత్తాలి, లేదా మనకి బుధ్ధి వచ్చి అలాంటి కోరికలు మనమే వదిలెయ్యాలి. ఈ రెండూ మనకి కష్టమే. అందుకే ఆ శాంకరి, మన పెద్దమ్మ, మన మీద తన అమ్మ ప్రేమ కురిపిస్తూ, తన ఉనికిని మనకి తెలిసేలా చేస్తూ, మనని తన వైపుకి తిప్పుకుంటుంది. దైవ పరమైన కోరికలుంచుకుంటే, ఆ అమ్మే మన విషయ వాంచలకి కూడా తగిన తీర్పు చేస్తుంది.
నాకు దైవం ఉనికి తెలుస్తున్నా, ఎందుకో ఒప్పుకోవడానికి చాలాకాలం మనసు అంగీకరించలేదు. ఇప్పుడు కారణం గురించి అలోచిస్తే, నేను అప్పట్లో విషయాల గురించి ఎక్కువ మదించానేమో అనిపిస్తుంది. అయితే, గత రెండు వారాల్లో ఆ స్వామి నామీద ఎంతో దయతో, నా దగ్గరికి వచ్చి, తన ఉనికిని ప్రేమతో చాటుకుని, నన్ను తన వొడిలోకి ఆహ్వానించాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకుండా మరేదైనా అలోచన చేస్తే ఆయన ప్రేమకి మనం ఇచ్చే సమాధానం, మన మూర్ఖత్వమే అవుతుంది తప్ప మరేదీ కాదు. అందుకే ఆయన ఇచ్చిన తెలివితో నేను ఒకటి కోరుకున్నాను. ప్రతిరోజూ, నిద్రలేచిన తర్వాత, ఆయన దర్శనం అవ్వకుండా, ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా, మంచినీళ్ళు కూడా తాగకూడదు అనుకున్నా. విషయ వాంచల గురించి తప్ప దైవాన్ని ఎలా స్మరించాలో తెలియని నా మట్టి బుర్రకి, ఈ మార్గం ఎందుకో మంచిదనిపించింది. అయ్య మహా సులభుడు కదా! నన్ను కరుణిస్తూనే ఉన్నాడు. గత వారంలో నేను తు.చ. తప్పకుండా రోజూ ఆయన దివ్య దర్శనం చేసుకుని, ప్రసాదం స్వీకరించి, ఆ తర్వాతే మిగతా భోగం గురించి అలోచన చేస్తున్నాను. ఆ భోగం కూడా, శివార్పణం అని స్మరిస్తూ ఆరగిస్తుంటే, నా ఆరోగ్యం మెరుగవుతోందనీ, ఆనందం హెచ్చవుతోందనీ నాకు అనిపిస్తోంది.
మొన్నెప్పుడొ, స్వామివారి ముందు కూర్చుని సరదాగా అన్నాను. అయ్య సులభుడు, అమ్మ మాత్రం త్వరగా ప్రసన్నం అవదు అని. ఇది నిజమో, అబధ్ధమో నాకు తెలియదు. దసరా పండుగలు, ఇంటి దగ్గర సరస్వతీ ఆలయంలో భేషుగ్గా జరుపుతున్నారని తెలిసి, ఆ ఆలయం ఎక్కడో కనుక్కుని వెడదామని నిన్న సంకల్పం చేశాను. ఇవ్వాళ పొద్దునే లేచి, ఆవిడ ఆలయం వెతుక్కుంటూ బయలుదేరితే, దారిలో స్వామివారు ముందు దర్శనం ఇచ్చేశారు, తర్వాత అనుకోకుండా అమ్మవారి ఆలయం అనుకుని సద్గురువు బాబా గారి నిలయానికి వెళ్ళాను. కాసేపు, నేను నిజమేనేమో, అమ్మ అంత తొందరగా కరుణించదేమో అనిపించింది. కానీ, తర్వాత రెండు నిమిషాలలో, ద్వాదశ జ్యొతిర్లింగాలు ఒక వైపు, నవగ్రహ సహిత జ్ఞాన సరస్వతి మరో వైపూ ఉన్న అందమైన ఆలయంలో, ప్రశాంతంగా అమ్మ దర్శనం చేసుకున్నాను.
తిరిగి అలవాటు ప్రకారం, అయ్యవారిని చూసి కాలేజీకి వెడదాం అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. రోజూ, ఆయన ప్రసన్న వదనం, మోక్షమార్గాలయిన ఆయన పాదాలు చూసి, రెండు క్షణాలు ఆయన సన్నిధిలో గడిపే నాకు, ఇవ్వాళ, అమ్మ ఆయన పక్కనే కనిపించింది. ఆవిడ, రోజూ అక్కడే ఉన్నా నా మూర్ఖపు కళ్ళు అయ్యంటే ఇష్టం ఎక్కువయ్యి, అమ్మని చూడలేదు కానీ, ఇవ్వాళ ఆవిడ కనపడగానే, “అయ్యని వదిలి అమ్మ ఎక్కడెకెళ్తుంది నాయనా” అన్నట్టు అనిపించింది. రోజూ, స్వామివారిని ఆయన దర్శన భాగ్యం నాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకునేవాడిని, ఇవ్వాళ కోరిక సవరించుకున్నాను. నాకు ఇకనుండి, నిత్యం అమ్మ అయ్యలిద్దరి అమూల్యమైన దర్శనం కావాలని.
అంతే కాదు. నేను గుడికి వెళ్ళిన ప్రతిసారీ, నాకు లభించే ప్రసాదంలో కొంచెం నా తోటి టీచరుకి ఇద్దామని అనుకోవడం జరిగేది. అయితే, ప్రసాదం తీసుకుని కాలేజీకి రవాలంటే, ఎదో ఒక సంచియో, డబ్బాయో పట్టికెళ్ళాలి కదా. నాకేమో బద్ధకం. ఏ రోజూ కోరికైతే ఉండేది కానీ, ఈ చిన్న పని చెయ్యాలి అని మాత్రం గుర్తుండేది కాదు. ఇవ్వాళ, గుడిలో ప్రసాదం, పొంగలి. చేతిలో వేసుకున్నానో లేదో, తోలు ఎర్రబడిపోయేంత వేడి. గాబరాగా తింటుంటే, మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొకరికి ప్రసాదం తీసుకుని వెళ్దామనుకుంటున్నాను అని. నా మరుపుకి స్వామి మంచి విరుగుడునే ఎంచుకున్నాడనిపించింది. మూగగా ఇంటికి వెళ్ళి, సంచీ, డబ్బా, తెచ్చుకుని, గుళ్ళో పూజారిగారిని అడిగి, రెండు దొప్పలు ప్రసాదం తీసుకుని, ఇవ్వాళే ఆ టీచరుకి ఇచ్చాను. ఆయన ఎంత ఆనందించాడో చెప్పలేను కానీ, ఆయన భక్తిలో లోటుంటే, స్వామి నాకెందుకు గుర్తుచేస్తాడు అనిపించింది. నిజమే కదా! స్వామి ఎక్కడెక్కడి వారి అవసారలకో, తన భక్తులని ఆవహించి న్యాయం చేస్తాడుట. ఇవ్వాళ, ఆయన నా ద్వారా మరో భక్తుడి కోసం పని చేశాడు అని తలుచుకుంటే ఎంత తృప్తిగా ఉందో.
నా పిచ్చిగానీ,
అయ్య అయినా అమ్మ అయినా, మనం కావాలి అనేలోపలే కరుణించెయ్యరూ!
నారాయణ స్మరణ చేస్తే కర్మలనించి విడిపించెయ్యరూ!
ఓం నమో నారాయణాయ ||