జననీ దుర్గాభవానీ

ప: జననీ దుర్గాభవానీ

మరచితివా నీ తనయని

కరుణ పాలించు కాత్యాయనీ

మరి మరి నిన్నే వేడితిని శర్వాణీ ||

చ: లేదమ్మా శృతిలయ ఙ్ఞానము

రాదమ్మా రాగాలాపనము

వ్రాయని తోచదమ్మ ఒక్క పదము

మన్నించి నీవే నడిపించు ప్రతిక్షణము

మన్నించి మమ్ము నడిపించు ప్రతిక్షణము ||

చ: గత జన్మయందు పొందిన శాపమో

వెలిఅయితి నమ్మ నిను చూడ ఈ క్షణము

మన్నించి కలనైన ఈవమ్మ అభయము ||

చ: లేవమ్మా ఙ్ఞానము, లౌక్యము

లేనే లేవే కల్లాకపటము

కూడదమ్మా బేలపైన కాఠిన్యము

ఈయవమ్మా మదితెలుపు చాతుర్యము

అలుకమాని చూపవమ్మా జీవితాన మాధుర్యము ||

మణిద్వీపవాసిణీ మమహృదయనివాసినీ

ప: మణిద్వీపవాసిణీ మమహృదయనివాసినీ

మహదేవునిరాణీ మమ్మేలవె జననీ ||

చ: మంగళప్రదాయనీ, మాంగల్యరక్షణీ

మహలక్ష్మి స్వరూపిణీ, మధుకైటబభంజని

మంజులభాషిణీ, మధురదరహాసిని

మహాపాపనాశిని, మృగనయని, మృడాణి ||

చ: మాణిక్యవీణధారిణి, మాతంగిమధుషాలిని

మహాశుంభనిశుంభాది దైత్యసంహారిణి,

మణిమకుట విరాజిని, మహా గనేష జననీ

మహాశక్తి స్వరూపిణి, మహిషాసురమర్ధిని ||

చ: మలయాచలవాసినీ, మమక్లేశనివారిణి

మహేంద్రాది దేవగణ అర్చిత పదపద్మినీ

మద్యమా నిషాదవర్జిత సమ్మోహన రాగమని

మరిమరినే ప్రార్ధించితి నీ చరణయుగళిని ||