భారతీ నే భారమా

ప: భారతీ నే భారమా

సరస్వతీ స రి గ మ ప ద ని స నీ

రాగతాళగతుల తీయగపాడెడు

వరమును ఈయగా ||

చ: వీణాపాణీ శ్రీవాణీ

స్వరమాధురి నీ గళమున రానీ

విద్యారాణీ శర్వాణీ

జ్ఞానజ్యోతి వెల్గనీ నా మదినీ

అమ్మా శారదా…

కృపజూపగా నే భారమా ||

చ: నారద జనని గీర్వాణీ

నా హృదికానీ నీ కోవెలనీ

కమలనయనీ కాత్యాయనీ

కామధేను నీవనీ కైమోడ్చితిని

అమ్మా భగవతీ…

అభయమునీయగా నే భారమా ||

చ: హంసవాహినీ గీర్వాణీ

కడదాక నిల్వనీ అధరాన హసమునీ

వేదజననీ విమలభాషినీ

వాక్కున విరియనీ సుమమాలికనీ

స్వేతపద్మాసినీ వరములనీయగా నే భారమా ||

గోధూళివేళాయె సంధ్యాసమయమాయె

ప: గోధూళివేళాయె సంధ్యాసమయమాయె

వైభవలక్ష్మి పూజకు తరుణమాయె

అమ్మనాహ్వానించగా తరలిరారే

తరుణులారా తరలిరారే ||

చ: ఇల్లువాకిలి కడిగి ముగ్గులేయరారే

గడపకూ పసుపురాసి బొట్టుపెట్టరే

ద్వారానికి మామిడితోరణాలు కట్టి

జయమంగళ నిత్యశుభమంగళమనుచు స్వాగతించరే, సుదతులారా

స్వాగతించరే ||

చ: బంగరు పీఠమేసి కలశముంచరారె

కలశాన అమ్మను ప్రార్ధించరే

అర్ఘ్యపాద్యాదులొసగి అలరించరారే

పసుపుకుంకుమలకోరి పూజించగా, పర్గునరారే పడతులారా

పరుగునరారే ||