రామా రామా రామా అనరా

ప: రామా రామా రామా అనరా

కలతలన్నీ తొలగురా

భక్తితో స్మరించరా

ముక్తిమార్గము చూపురా ||

చ: రామనామము నిరతము తలచి

రామునె మదిలో నిలిపె మారుతి

రామపాదము సోకగనే

నాతిగ మారెర రాతి ||

చ: రామునె శరణము వేడరా

అభయము తానే ఇచ్చురా

రామునే మదిలో నిల్పిన

కరుణతో నిన్ను కాంచునురా ||

ఎలా ఎలా మరువగలను అమ్మను

ప: ఎలా ఎలా మరువగలను అమ్మను

ఎలా తెలుపగలను అమ్మ ప్రేమను

ఎవరితో పోల్చను అమ్మ మమతను

ఎవరికి పంచను మదిలోని వ్యధను ||

చ: నవమాసాలూ మనల మోసి

రక్తమాంసాలు పంచి ఇచ్చి

ఉగ్గుపాలతో రంగరిచి ప్రేమను పోసి

తనను తాను మరిచి మన ఆకలి తీర్చి

నడక, నడతల నేర్పే గురువై నిలిచి

నూరేళ్ళు చల్లగా మననే దీవించి

ఎచటికో పయనమైన అమ్మ ఋణం!

తీర్చుకోగ చాలునా ఈ జన్మం ?

అందుకే అమ్మకు ఈ అశ్రుతర్పణం ||

చ: పసితనాన ఆటపాటల మనము చేసిన అల్లరి

ఆనందమె చేసెనుగా అమ్మను ఉక్కిరి బిక్కిరి

పదిమందితో ఆ రొజులు పంచుకొని మరీ మరీ

మైమరపించే మనవై ముసి ముసి నవ్వులు విసిరి

కరిగిపోయె నాకాలము కలగామారి

కలతలేగాంచి నేడు హృదయము చెదిరి

కలసి మెలసి మనముండెడు వరమేకోరి

ప్రార్ధించగ తరలెనమ్మ దేవుని చేరి

అందుకే అమ్మకు ఈ అశృనివాళి ||

చ: బ్రతుకు దారిపొడుగునా ఆటుపోట్లకోర్చి

పుట్టింటికి మెట్టినింటికి ఘనతనే తెచ్చి

పూలబాటను మనకు వేసి, ముళ్ళదారి తానునడచి

సంసారనౌక నడిపెనుగా ఎంతో శ్రమియించి

ఆ తల్లి నేర్పిన సంస్కారం విడిచి

తోబుట్టిన వాళ్ళమన్న మమతే మరచి

తగువాటలాడుతున్న మననే జూచి

విలపించదా, అమ్మ నింగిని నిలిచి ?

ఎందుకింకా వేదన ఆమెకు

కలసి ఉందము కడవరకూ ||