జాగేలనయ్యా పాలించరావయ్యా

ప: జాగేలనయ్యా పాలించరావయ్యా

నీ ముద్దు మురిపాల తేలించరావయ్యా ||

చ: చరణములే దిక్కని నమ్మితినయ్యా

శిరమును పదముల ఉంచితినయ్యా

మరి మరి నిన్నే వేడితినయ్యా

దీననుగావగ పరుగునరావయ్యా ||

చ: ముందుజన్మల ఎంత పాపము జేసితో

నీ పదదాసులయెడ అపకృతిజేసితో

ఏ కర్మజేసి ఈ జన్మముబొందితో

నీ కరుణ లేకున్న ఈ బ్రతుకు ఎందుకో ||

కరుణాంతరంగా శ్రీ పాండురంగా

ప: కరుణాంతరంగా శ్రీ పాండురంగా

నీ చరణాల గంగ, నా శిరసంటెనంట ||

చ: నీ ప్రక్కన ఉన్నది చంద్రభాగ

నీ పదములనంటగ ఆత్రముగ

నీ సన్నిధి నిలచిన ఉత్తుంగతరంగ, ఆ గంగ

అది తన హక్కేనందిగా, తన హక్కేనందిగా ||

చ: భక్తితొ భజనలుసేయంగా

అనురక్తితొ ఆరతులీయంగ

నీ కన్నుల కరుణే కురియంగ

నీ పెదవుల నగవులు విరియంగ

నీ ఆనతి తలదాల్చి ఆ గంగ

నా శిరసంటి నీ ఒడికి నను చేర్చెనంట ||