నీటిలోని కలువ విరిసె

ప: నీటిలోని కలువ విరిసె

నింగినేలే జాబిలిని జూచి

మదికలువ మురిసెనమ్మ షిరిడినాధుని కనులగాంచి ||

చ: శుక్లపక్షమందె మామ కురిపించునే వెన్నెల

వృధ్ధిక్షయమే జీవనమై ఆడేనతడు దాగుడుమూతలు

అందరానివాడు అంటుకోనీడు, ఆకాశాన దాగి అల్లరి రేరేడు

ఆకాశాన దాగి ఆ అల్లరి రేరేడు ||

చ: ఏ వేళనైనా సాయి చంద్రుడు మురిపించునే భక్తుల

మత్సరము బాపి ధ్యాన సిధ్ధినొసగు యోగిలా

అందరివాడు దరిజేర్చువాడు

మల్లెల మనసున్న మా సాయి రాముడు ||

చ: పరుగులెత్తె చిలిపి మది

షిరిడినాధుని పిలుపువిని

కనులదొరలె భాస్పగని, హృదయమందె అతనిగని ||

సాయిలేని జీవితమే పల్లేరు బాట

ప: సాయిలేని జీవితమే పల్లేరు బాట

సాయి సన్నిధాన్మే మల్లెల తోట

సాయి హృదయమే మనకు నెలవైన కోట

సాయి మాటే మనకు వేదమంత్రమట

సాయి నీడనుంటే బ్రతుకు స్వర్గమేనంట ||

చ: మనవారిపై తగని మమకారమంట

పరులపై ఎందుకో తెలియని ద్వేషమంట

మనిషిగ పుట్టికూడ ఎందుకీ ఖర్మంట

ఎవరికి ఎవరో రేపు తెలియనే తెలియదంట

అందుకే సాయి బాట నడిచి తరియించమంట ||

చ: కన్నులు రెండైనా చూపు ఒక్కటేనంట

పలుపేర్ల పిలిచినా పరమాత్ముడొక్కడంట

నాలుక ఒక్కటైనా మాటలే రెండంట

ఆ మంటల మంచి చెడులు తెలిపె బుధ్ధి ఒక్కటంట

బుధ్ధినే అనుసరించు సాయి బాట పయనించు

ఆత్మానందమే నిన్నపుడు వరియించు ||