కాలేజీ బస్సు ఏ టైముకొస్తుందో తెలియక, మా ఆవిడ చేసిన రొట్టెలు తిని పరిగెత్తాను. ఇంట్లొ వింటున్న పాటలు నాకు ఇష్టం కానీ ఏం చేస్తాం అనుకుంటూ మా స్టాపు దగ్గరికి చెరేసరికి విందునా; అవే పాటలు, పక్క కొట్టువారో, ఇంటివారో వింటున్నారు. అవి ఓ మాదిరిగా నా చెవుల్లోనూ పడటం చాలా బాగుందనిపించింది. ఇంతకీ ఆ పాటలెవిటి అంటారా? అవి మన వెంకటేష్ గారి ‘నువ్వు నాకు నచ్చావ్” సినిమావి. రెండు నిమిషాల్లో మా బస్సు రానేవచ్చింది. ఎక్కిన తర్వాత గంట ప్రయాణం అంటే సహజంగా నిద్రొస్తుంది. కానీ ఈ రోజు నాకు కొన్ని అనుభవాలు గుర్తొచ్చాయి, వాటిలోని అనుభూతులు మధురంగా వినిపించాయి. వినిపించాయి ఏంటనా? అవునండీ, అవి నేను విన్న పాటలగురించి మరి. దాదాపు ఎనిమిది సంవత్సరాలక్రితం, అవే పాటలు ఒక చిన్న ‘వాక్ మేన్” లొ క్యాసెట్ వేస్కొని వింటూండెవాడ్ని. తర్వాత కొంతకాలానికి, ఆ పాటలు ఏ బడ్డీ కొట్టో, చా బండి దగ్గరో తప్ప ఎక్కువగా విన్న జ్ఞ్యాపకాలు లేవు. ఆ తర్వాత మరి కొంతకాలనికి, ఈ మధ్యనే నా కంప్యుటర్లోనో, అప్పుడప్పుడూ టివిలోనో మాత్రమే వింటున్నాను. తీరిక సమయాల్లో మ్యూజిక్ సిస్టం ఎలాంటిదైతే పాటలు వినడం బావుంటుంది అని సోది కబుర్లు చెప్పుకునేవాళ్ళమో, నేను బస్స్టాపు దగ్గర పొందిన ఆనందం తల్చుకుంటే అవి నిజంగా సోది కబుర్లనే అనిపిస్తోంది. ఎంతైనా ఆలోచనలు గజిబిజిగా, మనం బిజిబిజీగా ఉన్నపుడు అనుకోకుందా వినే సంగీతంలో ఉన్న ఆనందం అనుభవించాల్సిందే! ఆప్పుడనిపించింది, నేను ఇంట్లో వినే ఆ పాటలే, బస్స్టాపు దగ్గర శ్రావ్యంగా ఉన్నాయేమో అని.