మనసులో ఆట, బయట దొంగాట

నేను బయట ఊరెడతానని వాడికి చెప్పడం తప్పలేదు. అదే ఒక రకం ఖర్మ. దీనికి తోడు వాడు నన్ను పనికిరాని, అసంబధ్ధమైన, దిక్కుమాలిన ప్రశ్నలేసేటప్పటికి, నాకొచ్చిన చిరాకుకి, నా మనసులో ఒక ఆట, కానీ సమాజం కోసం, బయట దొంగాట.

నా కష్టాన్ని తీరుస్తాడని, వాడికి సమస్య మొత్తం చెబితే; వాడిచ్చిన చెత్త సలహా: “ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. మనం వాళ్ళతో మెలగడం నేర్చుకోవాలి”. నా ఉద్దేశంలో ఈ సలహాకి అర్ధం: “సారీ! నేను నీకు సహాయం చేయదల్చుకోలేదు. ఎందుకంటే, అవతల వైపు ఉన్నవాడు నా చంకలో తల దాచుకుంటున్నాడు”. నా ఉద్దేశం, నా మనసులో ఆట. బయట జరిగే దొంగాట, సలహాకి ధన్యవాదాలు: “అర్ధమైంది సార్, మీరు చెప్పింది ప్రయత్నిస్తాను”.

నా కధ నేను రాసుకుంటుంటే, “నా కళ్ళతో అయితే కధ ఇంకోలా రాయచ్చు” అనే వాడు తగిల్తే ఏమనిపిస్తుంది? నా మనసులో ఆట: “కధ నాది కదరా”. బయట దొంగాట: “నిజమేనండీ! ఎంత బాగా గమనించారో”.

“పని మొదలెడతాను మహాశయా” అని నేనంటే, అవతలివాడు “అసలు శెలవు ఎందుకు పెట్టావో చెప్పు, ఆ తర్వాత పని గురించి మాట్లాడదాం” అనే వాడు ఎదురైతే, మీకేమనిపిస్తుందో? నా మనసులో ఆట మాత్రం: “నీకు పని కావాలా, లేక కారణాలు కావాలా?”. బయటకి, నా ఖర్మకి, సమాజంలో మెలిగే అతితెలివి సొగసుకి, నా మాట: “అంటేనండీ.. అప్పుడు మీకు చెప్పి వెళ్ళాను కదా.. మరి ఇప్పుడు.., .., అలాగేనండీ, మీరెలా చెప్తే అలానే. ఆయ్, చిత్తం!”

నేను కనపడలేదని, నన్ను అడగకుండా, నేనేంచెయ్యాలో నిర్ణయం చేసాడొకడు. అందులో సమస్య ఉంది, ఆ పని, ఆ రోజు నేను చెయ్యలేను అని మొర పెడితే, వాడిచ్చిన సమాధానం: “అయితే, ఇంకొకరి చేత చేయించు”. మనసులో మాట: “ఒరేయ్ పిచ్చోడా! బధ్ధకస్తుడా! నువ్వు చేసిన తప్పుకే, నేను తల పీక్కుంటున్నాను. పైగా, నన్నుకూడా తప్పు చేయమని (అదే, నీ పని చేయమని) సలహాలిస్తావా?”. కానీ బయట మురిపెంలో దొంగాట: “సరేలెండి, మీరు మాత్రం ఎంత పని చేయగలరు”.