మనిషి మనసు కోతి

అడవిలో చెట్లు మనుషులంటే ప్రేమతో ఆత్మత్యాగం చేస్తే
వాహనాలు తిరగటానికి వీలుగా నిన్ను వేసారనుకున్నా

కానీ రోడ్డు మహాశయా

మూక-గృహాలు కట్టి వ్యాపారం చేసుకొనే కొందరికి,
చెట్లను దొరికినంతవరకూ నరకటానికి,
నిన్నే ఒక వాహనం చేసిన మనిషి తెలివి చూస్తే, అబ్బా…!

ఏం చెప్పమంటావ్ రోడ్డు దేవా

ఇంత తలదాచుకునే చోటుకోసం,
ఆ చోటుని తనది చేసుకోవటంకోసం,
మనిషి అడిగే మొదటి ప్రశ్న
“రోడ్డుకి దగ్గరేనా?” అని!

ఏవిటొ మనిషికి నీమీద అంత ప్రేమ!

రోడ్డు నారాయణా

నీకు దగ్గరవడానికి,
మనిషి ప్రకృతి నుండి దూరంగా వెళ్ళిన ప్రతిసారీ
మనిషి తన ఆనవాళ్ళనే కోల్పోతున్నాడు కదా,
నువ్వు మమ్మల్ని కరుణించవా?

ఓహో, అర్ధమయింది రోడ్డు ఈశ్వరా

ఆ ఇంత చోటు కూడా లేని వారికి
నీ పక్కనే, నువ్వే ఎంతో కొంత చోటు ఇస్తానంటున్నావ్ కదా
ఎంత మంచివాడివి నువ్వు.

కాని నిన్ను ఇంకా అర్ధం చేసుకోలెక,
నీ మీద ప్రేమతోనే, నిన్ను లావు చేయాలని,
ఆ చిన్న వారిని తోసేస్తున్నారు, మరి కొంతమంది మనుషులు,
మరి అప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి కదా!

అబ్బో, రోడ్డు రామా, అలా అంటావా!

నాకు తెలియలేదు రామా నిజంగా, కానీ, నువ్వేకదూ,
పని సృష్టించి ఆ చిన్న వారికి చిన్న ఆసరా చూపిస్తున్నావ్.
మరి రామా, వారిని నీ నుంచి దూరంగా ఎందుకు పంపుతున్నావ్?

హమ్మ రోడ్డు స్వామి, నువ్వు గొప్ప తుంటరివే?

వీళ్ళు ఎక్కడికో వెళితేనే కానీ, నువ్వు మరోచోట వెలియలేను అంటావ్!
అంతే కదా? అయినా, నీకు అలాంటి తుంటరి కోరికలు తప్పు కాదా స్వామీ?

__________________
రోడ్డు:

నేను మౌనంగానే ఉన్నానురా బడుధ్ధాయి.
అంతా మీ తెలివి, మీ మూర్ఖత్వమే కానీ,
ఇందులో నేను చేసినదేమీ లేదురా?

నన్ను వాహనాల కోసం వాడినంత కాలం నేను మీకు సహాయపడ్డాను,
నన్నే వాహనాన్ని చేస్తే, నీరస పడ్డనేమో కాని,
సహాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాను!

మరి నువ్వేమో, స్వజాతి లక్షణం పోనిచ్చుకున్నావు కాదు.
ఇన్ని ప్రశ్నలు వేస్తావా నన్ను? పైగా పొగుడుతూ మరీనూ!

అంతలో ఎదో మైకు శబ్దం

ఒరేయ్ అబ్బయ్. మీ మంత్రిగారు నన్ను లావుచేస్తానని, నన్ను ఎక్కడెక్కడో కొత్తగా ప్రతిష్టిస్తానని అంటున్నాడు. నువ్వు, ఈ ప్రశ్నలన్నీ అతన్నే అడుగు.

__________________________

మంత్రిగారితో:

అయ్యా, మంత్రిగారు… అసలు విషయమేమిటంటే…

(జరిగిన కధ మొత్తం, ప్రశ్నలతో సహా)

మంత్రిగారు:

నీ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానమోయ్.

మనిషి మనసు కోతి.

అయినా అవన్నీ కాదు అబ్బాయ్. ఎలక్షన్ల తర్వాత, నీకు రోడ్డు పక్కన ఒక కొత్త ఇల్లు ఇస్తాను. ఇలాంటి ప్రశ్నలు అడగటం మాత్రం ఆపెయ్.

2 thoughts on “మనిషి మనసు కోతి

Leave a reply to Vinay Chaganti Cancel reply