అందం, ఆనందం

కరెంటు పోయిన చిరాకులో,
అర్ధాంగి దీపం వెలిగిస్తే,
ఆ దీపపు కాంతిలో,
నా చిన్ని రాముడు నవ్వితే,
అదీ అందం.

అడగకున్నా వచ్చే అవసరంలేనంత వర్షం,
అందులో ఆరోగ్య దురావస్థలు,
అయినా, ఇంటిని చక్కదిద్దే ఇల్లాలు,
పిల్లాడిని కంటికి రెప్పలా చూసుకునే కన్నతల్లి,
ఆ తల్లి చెప్పకపోయినా,
ఆవిడ నీరసానికి మందుగా నవ్వే నా రాముడు,
అబ్బా, ఆ నవ్వే కదూ అందమంటే.

పిల్లాడికి తిండి సహించక వాంతులవుతుంటే,
చూచి తట్టుకోలేని చిన్నారి తల్లి తల్లడిల్లుతుంటే,
అర్ధంచేసుకోవలసిన వారు అర్ధంలేని ప్రశ్నలు వేస్తుంటే,
అయ్యో, నేనేమి చెయ్యాలో అని తండ్రి ఆదుర్దా పడుతుంటే,
లోకంతీరు తెలియని నా రాముడు,
ఊహ కూడా ఏర్పడని కల్యాణ రాముడు,
వాడి బాధ మరిచి చిరునవ్వులొలికిస్తే,
ఆ నవ్వుకన్నా అందమైనది ఏముంటుంది?

తెల్లవారుఝామునే డాక్టరుని ఖంగారు పెట్టినా,
ఏడింటికే బంధువులని నిద్రలేపినా,
నిత్యకార్యక్రమాలని వదిలేసి మొగుడిని పరిగెత్తించినా,
తన తల్లి అమాయకత్వాన్ని చూసి,
ఎక్కడ బామ్మని, తాతయ్యని గాబరా పెడుంతుదోనని,
అమ్మకి తోడుగా, శ్రీ రాముడు నవ్వితే,
ఆ నవ్వు అందం ఎలా కొలవగలం?

ఆరు నెలలు నిండని ఆ నవ్వులో,
ఏమిటో ఆ కరుణ,
ఎందుకో అంత ప్రేమ,

నా ఈ చిన్ని రాముడు,
ఆ శ్రీ రాముడినే తలపిస్తుంటే,
మా జీవితానికన్నా ఆనందమయ జీవితాలు ఉంటాయా?

అందుకనే, ఈ చిన్న దీవెన.
ఆ శ్రీ రాముడు నా రాముడిని చల్లగా చూడుగాక.

2 thoughts on “అందం, ఆనందం

  1. Chandu's avatar Chandu

    మీ చిట్టి రాముణ్ని ఆ రామ చంద్రుడు చల్లగా చూడాలని మా ఆకాంక్ష.
    శ్రీరామ జయం.

Leave a reply to Vinay Chaganti Cancel reply