సర్వదేవతా స్వరూపాలు

అడగకుండా ఆకలి తీర్చే అమ్మ, అన్నపూర్ణ
నేను తప్పటడుగులు వేస్తూంటే నా మీదనించి కన్నులు తిప్పని నా తల్లి, విశాలాక్షి
నాతో ఆటలాడిన మా అమ్మ, బాల
పక్కనే కూర్చుని నా చదువు తను చదివి నాకు నేర్పిన తల్లి, సరస్వతి
నాకు సంగీతం నేర్పిన మా అమ్మ, శారద
నాకేమి కావాలో చూసే మా అమ్మ, కామాక్షి
నేనడిగినది ఎప్పూడూ కాదనని మా అమ్మ, వరలక్ష్మి
నేను బాగుండాలని దేవుణ్ణి ప్రార్దించే మా అమ్మ, మీనాక్షి
నా తప్పులని క్షమించగలగిని మా అమ్మ, ఈశ్వరి
నాకు భక్తిని నేర్పే మా అమ్మ, అఖిలాండేశ్వరి

నా తప్పులన్నీ భరించి నాకు ఎప్పుడూ మరో అవకాశాన్ని ఇచ్చే నా తండ్రి, వేంకటేశ్వరుడు
తెలిసీ తెలియక నేను చేసిన ఖర్చులన్నీ తను తీర్చే మా నాన్న, లక్ష్మీ వల్లభుడు
కారణం లేకుండా నన్ను కష్టపెట్టిన వారిని దూరంగా ఉంచే మా నాన్న, రుద్రుడు

ఎన్నని చెప్పగలను, ఎన్ని రీతులలో వర్ణించగలను
వారి ప్రేమకు లొంగి వారికి పాదభివందనం చెయ్యడం తప్ప
సర్వదేవతా స్వరూపాలయిన నా తల్లితండ్రులకు నేనేమి చెయ్యగలను

అమ్మ పెంపకంలో నేర్చుకున్న మంచి విషయాలు స్వనిర్ణయాలతో విసర్జించి,
వాటి విలువలు ఇప్పుడిప్పుడే తెలిసొస్తుంటే, మళ్ళీ అమ్మ కొడుకునైతే బాగుండుననిపిస్తోంది

నాన్న ఆదరణలో, ఆయన ప్రసన్నమైన వదనం నీడలో అనుభవించిన స్వేచ్చ దూరమవుతుంటే
అలాంటి స్వేచ్చ కోసం, జీవితాంతం ఆ తండ్రి కొడుకుగా ఉంటే బాగుడుననిపిస్తోంది

కోరిక ఉండకపోతే దేవుణ్ణి చేరతామట!
నా తల్లితండ్రులు బాగుండాలి,
నేనెప్పుడూ వారితోనే ఉండాలి,
అనే నా కోరిక తీర్చలేకపొతే
నీతో నాకు నిజంగా పనిలేదు దేవుడా
ఎందుకంటే, దేవుడి ప్రేమైనా, అమ్మ నాన్నల ప్రేమ తర్వాతే కదా.

అయినా, నీ అంతటి వాడివి నువ్వే వకుళమాతని ఇంకా వదిలి పెట్టలేదే
నన్నేమో, మా అమ్మకి నాన్నగారికి దూరంగా ఉంచుతావా?

నాకు తెలియక తప్పుగా అడిగితే క్షమించు దేవుడా!
ఎందుకంటే ఇప్పుడు నేనంటే నేను మాత్రమే కాదు,
నేను ముగ్గురిని, కల్యాణిని, కల్యాణవల్లభుడిని, కల్యాణరాముడిని.
చెట్టుగా ఎదగాల్సిన నన్ను, వేరు నుండి ఎంతకాలం వేరుగా ఉంచుతావు స్వామీ?

 

4 thoughts on “సర్వదేవతా స్వరూపాలు

  1. వినయ్, పదాల నిండా భావాలు నింపి అమ్మానాన్నల దగ్గర అక్షరాల రూపంలో అందంగా ఒదిగిపోయారు. భాష చక్కగా ఉంది, శైలి క్రొత్తగా ఉంది, భావం నిండుగా ఉంది. ఒక్క మాటలో చాలా బాగుంది.

Leave a reply to Raghu Cancel reply