ఒకప్పుడు నా గది చూసినవారికి మతిపోగొట్టిన విషయం, అందులో ఉన్న పుస్తకాల సంఖ్య. అప్పట్లో తెగ చదివేశానులెండి. జ్ఞాదోయమైన తర్వాత (అంటే మన పిచ్చికి పరాకాష్ట తెలియడం); ఎందుకు పనికొస్తుందో తెలీక నేను చదువుతున్న పుస్తకాలన్నీ, ఎవరు వాటిని చదివితే బాగుపడతారో అని బాగా ఆలోచించి, అప్పట్లో నేను పనిచేసే కాలేజీ స్థాపించిన మహారాజుగారిని ఉదాహరణగా తీసుకుని, ఆ పుస్తకాల్లో చాలావరకూ మా కాలేజీ లైబ్రరికే ఇచ్చేశాను.
ఇదిలా అవుతుండగా నేను గమనించని ఒక విషయం మా ఇంట్లో జరిగిపోయింది. మా అమ్మ నాకుమల్లే చాలా పుస్తకాలు–బహుశా నా వెర్రితనంతో నేను కొని చదివిన పుస్తకాలకంటే, ఆవిడ భక్తితో దేవుడిగురించిన పుస్తకాలు, అంటే భక్తుల అనుభవాలు, గురువుల చరిత్రలు, రామాయణ మహాభారతాలు, భాగవతాలు, స్థలపురాణాలు, వ్రత కథలు వగైరా అన్నమాట–కొనేసి, కొన్ని ఆవిడే రాసేసి, మరో చిన్న లైబ్రరీని ఇంట్లోనే స్థాపించింది. నా గది చూసి నన్ను పిచ్చివాడని అన్నవాళ్ళు నిజంగా ఏమనుకునేవారో తెలీదుకానీ, మా అమ్మ చదివేసిన పుస్తాకాలు చూసి నాకు మాత్రం కొద్ది సెకన్లపాటు ‘చ్చీ, నా జీవితం; ఎంత టైం వేస్ట్ చేశానో’ అనిపించింది. అంతే కదా మరి.
అలా ఆ పుస్తకాలు చూస్తూ, అమ్మని అడిగాను “ఏవిటమ్మా ఈ పూజలు? నాతో గడపడానికి నీ దగ్గర టైం లేదు కానీ…”. ఆవిడ చాలా సింపుల్‌గా “ఇవన్నీ నీకోసమే రా” అనేసరికి నా నోరు కాసేపు మూతపడిపోయింది. అయినా ధైర్యం చేసేసి అన్నాను, “అయితే రేపు మన రాముగాడికోసం నేనో, నీ కోడలో ఇన్ని పూజలూ చెయ్యాల్సిందేనంటావా” అని. ఇక్కడే ఆవిడో మంచి మాట చెప్పింది, “చెయ్యగలిగితే మంచిదే, చెయ్యలేకపోతే కనీసం సరదాగా ఇంట్లో ఉన్న దేవుడికి నాలుగు కబుర్లు చెప్తూ ఉండు. అంతా ఆయనే చూసుకుంటాడు. అయినా మా నానమ్మ చేసిన పూజలేరా నన్ను కాపాడింది ఇప్పటివరకూ. అలాగే నేను చేసే పూజలు నీ తరానికీ, నీ తర్వాతి తరానికి కూడానూ” అనేసింది.
అప్పుడనిపించింది పుణ్యం బాలెన్స్ పెరగడానికి నేనుకూడా అమ్మకి ఉడతాభక్తితో ఎంతో కొంత సాయంచేస్తే బాగుంటుదని. మనకి దేవుడితో డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోయినా, ఎదో నాలుగు కబుర్ల వ్యవహారమే కదా! పైగా కాలక్షేపానికి, బోలెడన్ని కధల పుస్తకాలు. చదివితే, నిన్నే తిరగేసిన రామాయణ గేయరూపకంలోని మొదటి పేజీలో చెప్పినట్టు, పుణ్యం-పురుషార్థం రెండూ వస్తాయి కదా.
అసలు విషయమేంటంటే, ఆ పుస్తం తీసి చదవటం మొదలెట్టడమే నేను చేసిన ఘనకార్యం. ఒక పేజీ చదవగానే, నేను తెలుగుకి ఎంత తెగులుపడిపోయనో తెలిసింది. వెధవది ఏమైతే అవుతుందికానీ, తెలుగులో కూడా ఒక ఎం.ఎ చేసేయ్యాలనిపించింది. ఒకప్పటి నా పిచ్చి పూర్తిగా వదల్లేదని, నా పక్కనే ఉన్న మనిషిని చూస్తే అర్ధమయింది. అడిగింది లేదనకుండా ఇస్తే నేనేదో గొప్పవాడినౌతానని, నాకోసం ఇప్పటికీ శ్రమించే ఆ మనిషి మా నాన్నగారు.
వినయ్…మీ రాతలు చూస్తుంటే మీలో ఏదో కొత్తదనం ప్రవేశించిందనిపిస్తుంది. అక్షరాల్లో ఆధ్యాత్మికత ఉరకలేస్తోంది. అసలేం జరిగింది? శ్రీ మన్నారాయణమూర్తి ఏంచేశాడు మిమ్మల్ని? ఆయన అస్సలు కుదురుగా ఉండేరకం కాదని తెలుసు..మెత్తని శేషపాన్పుపై, అమ్మ పాదాలు ఒత్తుతూ ఉంటే, హాయిగా పడుకోకుండా ఏదో ఒక జట్టీ తెస్తూనే ఉంటాడు. మిమ్మల్నేం చేశాడు?