ఆశ్చర్యం, దైవ సంకల్పం

ఆశ్చర్యం, దైవ సంకల్పం

అన్వేషిస్తే దొరకనిది
కలిగితే మరువలేనిది

నేను సత్యం కంప్యూటర్స్ లో పనిచేసే రోజుల్లో, నా సహోద్యోగి, చైతన్య, అల్లరిగా ఉంటూ ఉండేవాడు. వాడిని, వాడి నవ్వుని, వాడి అలోచనల తీరునీ మర్చిపోవడం చాలా కష్టం. వాడిని సరదాగా అందరం “మోడ్రన్ బుధ్ధ” అని పిలుచుకునే వాళ్ళం. కానీ, రివ్యూ సమయం దగ్గరపడేసరికి అందరిలానే ఉంటాడులే అనుకునే మాకు, వాడు కలిగించిన ఆశ్చర్యం ఎప్పటికీ మర్చిపోను.

అందరూ, తమ సీనియర్లని మెప్పించి జీతంలో పెంపుకోసమో, స్థాయిలో ఒక ముందంజకోసమో కష్టపడుతుంటే; వీడు మాత్రం, ప్రశాంతంగా ఉన్నాడు. అదేవిట్రా అని అడిగితే వాడిచ్చిన సమాధానం, ఆశ్చర్యమే కాదు, ఒకింత ఙ్నానబోధ కూడా చేసిందనే చెప్పాలి:

“ఆశపడి బాధపడేకంటే, మర్చిపోయి సుఖపడటం ఉత్తమం”.

________

2006 లో, హైదరాబాదు, వైజాగుల మధ్యన తెగ తిరిగిన నేను, అప్పుడప్పుడూ కాకినాడలో మా తాతగారింట్లో తలదాచుకునేవాడిని. తాతగారికి ప్రాపంచిక ఙ్నానం ఎక్కువ. ఆయన రోజుల్లో అమెరికా చూసిన భారతీయులు చాల తక్కువ అని నాన్నగారు చెప్తూఉండేవారు. అప్పటిలో తాతగారు, నాకు కొన్ని మంచి విషయాలు చెప్పేవారు. అందులో నాకు నచ్చినది, మా నాన్నగారిలా గొప్పవాడిని అవ్వాలనడం. నన్ను అంతగా ఆకట్టుకోనిది, దైవం గూర్చిన పుస్తకాలు చదవమనడం.

అంతేనేమోలెండి! ఆధునిక చదువుల వలయంలో ఉన్న వాడికి, మన దేశానికే వన్నె తెచ్చిన ఆధ్యామికత ఎలా రుచిస్తుంది.

తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంది! 2006 వెళ్ళిపోయింది, 2012 వచ్చింది. ఎంత మార్పు! ఆ రోజుల్లో, మా నాన్నగారు, తాతగారు నన్ను చదవమన్న పుస్తకం, పి.వి.అర్.కె. ప్రసాద్ గారి “సర్వసంభవాం”. మూర్ఖత్వపు ముసుగు కమ్మిందేమో, అప్పట్లో ఆ పుస్తకం నేను ముట్టుకోలేదు. కాని, ఇవ్వాళ, నా అంతట నేనుగా ఈ పుస్తకం వెతుక్కుంటూ, చదవాలని పరితపిస్తూ తిరుగుతున్నాను. రెండు వారాలు తిరిగాను. దైవ కృపేమో, నా అదృష్టమేమో, ఈ రోజు నాకు పుస్తకం దొరికింది.

ఈ పుస్తక సారాంశం, “నాహం కర్తా, హరిః కర్తా”; నేను చేసేదేమిటి, అంతా ఆయనే చేస్తున్నాడు,  చేయిస్తున్నాడు. అహం నశింపచేసే పుస్తకంగా భావించి, నేను చదవటం మొదలుపెడుతున్నాను.

ఆశ్చర్యం, దైవ సంకల్పం

అన్వేషిస్తే దొరకనిది
కలిగితే మరువలేనిది

తెలివి మీరితే ఇంతే…

ఆరోజు వ్యక్తీకరణ పాఠంలో భాగంగా, కొంతమంది విద్యార్ధులని ఇంటర్వ్యూలు చెయ్యమని ఆయన నన్ను పిలిచారు. వారి మాట కాదనలేకే వెళ్ళినా, నాకు కూడా ఆ విద్యార్ధుల గురించి తెలుస్తుందన్న ఆశకూడా నన్ను వారి తరగతిగదిలోకి వెళ్ళేట్టు చేసింది. కొంతమంది పిల్లలు అల్లరిగా ఉన్నారు. వారి మాష్టారు చాల ప్రయాశపడి వారిని అదుపు చేస్తున్నారు. ఇదిలాగే ఉండగా, ఒక్కొక్కరిగా పిల్లలని నేనుకూడా ఇంటర్వ్యు చేస్తున్నాను, వారి సమాధానాలని విని, నాకు తోచినంతలో ఎవొ సలహాలు ఇచ్చే ప్రయత్నమూ చేసాను.

తరగతిలో ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగా…

ఓ నిద్రపోతున్న విద్యార్ధికి జాతకం అఘోరించింది; వాడిని నేను ఇంటర్వ్యు చెయ్యాల్సిన సమయం వచ్చింది.

నా ప్రశ్న: బాబూ, నా పేరు జగన్నాధం. ఇక్కడ ఇంటర్వ్యూలు చేసి ఉత్తమ విధ్యార్ధికి ఉద్యోగం ఇద్దామని వచ్చాను. మరి, నీ గురించి చెప్తావా?

అతని జవాబు: నా పేరు రంగడండి. నేను ఇంటర్వ్యు చేయించుకోడానికి వచ్చానండి.

వాడి తెలివి మీరి, తరగతి విద్యార్ధులంతా పక పకా నవ్వారు, మాష్టారు కూడా కొంత సంకోచించి అదే ఉచితమని భావించారు, నాదేముంది, మరో మాటతో ఇంటర్వ్యూకు స్వస్తి చెప్పాను.

నా సలహా: ఏది చేస్తే అది చేయించుకుంటానంటే, ఇక జీవితంలో నువ్వేం చేస్తావు నాయనా?